కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో దేశ వ్యాప్తంగా ఆర్ధిక ఇబ్బందులు మొదలయ్యాయి. ప్రభుత్వాలకు ఆదాయ మార్గాలు ఆగిపోయాయి. కేంద్ర ప్రభుత్వానికి రోజు 50 కోట్ల ఆదాయం రావడం కూడా చాలా కష్టంగా మారింది. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తూనే… కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజా ప్రతినిధుల జీతాల్లో కోత విధించడానికి సిద్దమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సమర్ధించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన యనమల ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఆర్థిక కష్టాలను అర్థం చేసుకుని ఉద్యోగులు సహకరించాలని యనమల ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు.
ఇక ఇదే సమయంలో ఆయన విమర్శలు కూడా చేసారు. కరోనా వైరస్ దెబ్బకు ఓ వైపు ప్రపంచమంతా వణికిపోతుంటే, ఏపీ సీఎం జగన్ మాత్రం దీనికి పెద్దగా భయపడాల్సిన పనిలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని, ప్రజల ఆరోగ్యంపై జగన్కు ఎంత శ్రద్ధ ఉందన్న విషయానికి ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని, ఆదాయం పడిపోతుంది అని చెప్పిన జగన్… దీని నుంచి బయటపడేందుకు ఏ విధమైన చర్యలు చేపట్టబోతున్నారో చెప్పలేదని మండిపడ్డారు.