ఇప్పటికే టమోటా, పచ్చిమిర్చి ధరలు పెరగడంతో సామాన్యులు వాటిని వాడటం మానేశారు. వీటితో పనిలేకుండా ఉండే కూరలు చేసుకుంటున్నారు. ఏ కూరలో అయినా ఉల్లిపాయలు కచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఉల్లి ధరలు కూడా పెరగనున్నాయి. టమోటా దారిలోనే ఉల్లి వెళ్లబోతుందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. ఈ నెలాఖరుకు ఉల్లిధరలు భారీగా పెరిగే అవకాశం ఉందట.
రిటైల్ మార్కెట్‌లో కిలో ఉల్లిపాయలు ₹25-30 వరకు పలుకుతున్నాయి. దేశంలోని ప్రధాన మార్కెట్‌లలోకి ఆనియన్ సప్లై క్రమంగా తగ్గుతోంది, రేటు మెల్లగా పెరుగుతోంది. గత నాలుగు నెలలుగా ఉల్లిపాయల రేట్లు సామాన్యుడికి అందుబాటులోనే ఉన్నాయి. సాధారణంగా ఏటా ఆగస్టు, సెప్టెంబర్ నెలలు ఉల్లికి కరవు కాలం లాంటిది. పంట వేయడం-దిగుబడి రావడం మధ్య ఉండే టైమ్ ఇది. కాబట్టి, ఈ రెండు నెలల్లో సప్లై తగ్గుతుంది, రేట్లు పెరుగుతాయి. ఉల్లి పంట కోతలు అక్టోబర్‌లో స్టార్ట్ అవుతాయి. ఆ నెల నుంచి మార్కెట్‌లోకి మళ్లీ సప్లై పెరిగి, ఉల్లి ఘాటు తగ్గుతుంది. ఇది ఏటా జరిగే విషయమే.
శీతాకాలంలో పండించే ఉల్లి పంట, దేశవ్యాప్త వార్షిక డిమాండ్‌లో 70%ను తీరుస్తుంది. కొన్ని నెలలుగా రేట్లు ఆశాజనకంగా లేకపోవడంతో, ఈ సంవత్సరం ఖరీఫ్ సీజనులో రైతులు ఉల్లిని తక్కువగా సాగు చేశారు. సాగు విస్తీర్ణం 8 శాతం మేర తగ్గింది. ఉల్లి దిగుబడి 5 శాతం తగ్గుతుందని అంచనా. ఈ ఏడాది మొత్తం ఉత్పత్తి 29 మిలియన్ టన్నులకు (MMT) చేరొచ్చని అంచనా. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి సాగు అంత గొప్పగా లేదని వ్యాపారులు కూడా అంటున్నారు.
దీనికి తోడు, రైతులు నిల్వ చేసిన ఉల్లిపాయలు గత నెలలో కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా పాడైపోయాయి, ఆసియాలో అతి పెద్ద ఆనియన్ మార్కెట్ అయిన లాసల్‌గాన్ మార్కెట్‌లోకి సప్లై తగ్గింది. మున్ముందు ఉల్లి రేట్లు పెరుగుతాయన్న అంచనాలతో, బడా బాబులు ముందుగానే ఆనియన్స్ కొని నిల్వ చేసుకున్నారు. దీంతో, సెప్టెంబర్ చివరి వరకు మార్కెట్‌లో అందుబాటులో ఉండాల్సిన రబీ స్టాక్, ఈసారి త్వరగా ఖాళీ అయింది, నిల్వ కాలం 1-2 నెలలు తగ్గింది. మిగిలివున్న కొద్దిపాటి సరుకు కూడా ఈ నెలాఖరుకు ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది.
ఈ కారణాలు అన్నీ కలగలిపి.. ఫలితంగా ఈ నెల చివరి నాటికి రిటైల్ మార్కెట్‌లో ఉల్లి రేటు పెరగనుంది. సెప్టెంబర్‌లో అధిక స్థాయికి చేరుతుందని క్రిసిల్ కూడా ఇటీవలే రీసెర్చ్ చేసి చెప్పింది. ఉల్లి సరఫరాలో కొరత రేటు పెరగడానికి కారణం అవుతుంది. వచ్చే నెలలో కిలో ఉల్లిపాయలు 60 రూపాయల నుంచి 70 రూపాయలు వరకు చేరే అవకాశం ఉందని పోర్ట్‌లో వెల్లడించింది.