చిన్న సినిమాగా రిలీజ్ అయి సంచలనం సృష్టించిన బలగం సినిమా మరో అంతర్జాతీయ పురస్కారం పొందనుంది. తెలంగాణ సంస్కృతి, కుటుంబ బంధాల నేపథ్యంలో తెరకెక్కి మంచి విజయం సాధించిన ఈ చిత్రం ‘ఇంటర్నేషనల్ సౌండ్ అండ్ ఫిల్మ్ మ్యూజిక్ ఫెస్టివల్’లో హాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతోంది. ‘బెస్ట్ ఒరిజినల్ స్కోర్ ఫీచర్’ కేటగిరీలో ఈ సినిమాకి నామినేషన్ దక్కింది.
‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (బెస్ట్ సౌండ్ ఎడిటింగ్), ‘టాప్‌గన్: మావెరిక్’ (బెస్ట్ సౌండ్ ఎడిటింగ్)లాంటి సినిమాలు పోటీపడుతున్న ఫెస్టివల్‌కు ‘బలగం’ నామినేట్‌కావడంపై చిత్ర నిర్మాణ సంస్థ ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ ఆనందం వ్యక్తం చేసింది. ఈ ఫెస్టివల్‌లో 82 దేశాల నుంచి 1074 సినిమాలు పలు విభాగాల్లో పోటీ పడుతున్నాయి. అక్టోబరు 14న క్రొయోషియాలో జరగనున్న వేడుకలో విజేతలను ప్రకటించనున్నారు. కేవలం సంగీతానికి సంబంధించి ఇచ్చే అవార్డులివి. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్, సుధాకర్‌రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని వేణు యెల్దండి తెరకెక్కించారు.