ప్రస్తుతం ఇండియాలో వినిపిస్తున్నవి రెండే నినాదాలు ఒకటి అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో జైశ్రీరామ్.. మరోటి హను మాన్ సినిమా విడుదలైన సందర్భంగా జైహనుమాన్ అని. దేశవ్యాప్తంగా సెన్సేషనల్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్లలోనూ విజృంభిస్తోంది. అదిరిపోయే విజువల్స్ అంతకుమించిన బీజీఎం.. స్ట్రాంగ్ కంటెంట్తో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తండ్రి కూడా ఈ చిత్రాన్ని చూశారు. ఈ సినిమా చూసి ఆయన చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పారు. తన కొడుకు తీసిన సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతుంటే ఆ తండ్రి ఏ రేంజ్లో హ్యాపీగా ఫీల్ అవుతున్నారో చెబుతున్న ఓ వీడియో బయటకు వచ్చింది. ఆయన సాధారణ ప్రేక్షకుడిలా ఓ థియేటర్లో సినిమా చూసి బయటకు రాగా ఆయనే ప్రశాంత్ వర్మ తండ్రి అని తెలియని కొంతమంది రిపోర్టర్లు కెమెరాలు పెట్టి సినిమా ఎలా ఉందని అడిగారు. దానికి ఆయన చాలా అద్భుతంగా ఉందని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత తీసినోడు నా కొడుకు అంటూ ఎంతో గర్వంగా చెప్పారు.
ఈ సినిమా ఎలా అనిపించిందని అని అడగగా అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ప్రతీ పాత్ర బాగుందని, అందరూ బాగా నటించారని చెప్పుకొచ్చారు. నెక్ట్స్ ఏకంగా హనుమాన్ మీదే సినిమా వస్తుందని అంచనాలు పెంచేశారు. కొడుకు విజయాన్ని చూసి గర్వ పడుతున్న తండ్రి ఆనందం ఆ కళ్లలో కనిపిస్తుందంటూ నెటిజన్లు ప్రౌడ్ ఫాదర్ టు ఏ గ్రేట్ సన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Teesinodu naa koduku.#Hanuman pic.twitter.com/T3fGxbqQmR
— Satya 🥛 (@YoursSatya) January 13, 2024