ట్రెండ్ ఇన్: ట్రెండ్ సెట్ చేసిన పవన్ కల్యాణ్..‘గబ్బర్ సింగ్’నుంచి మించి ‘భవదీయుడు భగత్ సింగ్’

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్టామినా ఏంటో చూపించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. ఈ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత పవన్ కల్యాణ్ అశేష అభిమానులు కాలర్ ఎగరేసుకుని తిరిగారని చెప్పొచ్చు. జనసేనాని వీరాభిమాని అయిన హరీశ్ శంకర్..ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘దబాంగ్’ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కినప్పటికీ తెలుగు నేటివిటీకి, పవన్ కల్యాణ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లు చాలా మార్పులు చేశారు.

అప్పటి వరకు ఫ్లాపుల్లో ఉన్న పవన్ కల్యాణ్ కు ఈ సినిమా ద్వారా ఘన విజయం లభించింది. ఈ సినిమా ద్వారా తన సత్తా ఏంటో చూపారు పవన్ కల్యాణ్. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ కామెడీ టైమింగ్, డ్యాన్సులు, యాక్షన్ సీక్వెన్సెస్ నెక్స్ట్ లెవల్ లో ఉండటంతో పవన్ కల్యాణ్ అభిమానులు ఫిదా అయిపోయారు.

 

ఈ చిత్రంలోని డైలాగ్స్ అన్నీ కూడా పవన్ కల్యాణ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లు డిజైన్ చేశారు హరీ శ్ శంకర్. ‘‘నేను ట్రెండ్ ఫాలో అవను సెట్ చేస్తా’’, ‘‘నాక్కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది’’ అని పవన్ కల్యాణ్ చెప్పే వన్ లైనర్ డైలాగ్స్ థియేటర్లలో బాగా పేలాయి. ఇక హరీశ్ టేకింగ్ కు జనం ఫిదా అయ్యారు. రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ అందించిన సంగీతం, శ్రుతిహాసన్ తో పవన్ కల్యాణ్ లవ్ ట్రాక్, అలీతో పవన్ కామెడీ సీన్స్, అంతాక్షరి గేమ్ డిజైన్ అన్నీ హైలైట్ అయ్యాయి.

ఈ చిత్రం విడుదలై పదేళ్లయిన సందర్భంగా పవన్ అశేష అభిమానులు ట్విట్టర్ లో #PawanKalyan పవన్ కల్యాణ్ హ్యాష్ ట్యాగ్ తో ‘గబ్బర్ సింగ్ ’ సినిమా ఫొటోలు షేర్ చేస్తున్నారు. అప్పట్లో థియేటర్ల వద్ద చేసిన సంబురాలు వీడియోలూ షేర్ చేసి ఆ రోజు సందర్భాలను గుర్తు చేసుకుంటున్నారు. అలా సదరు హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. పవన్ కల్యాణ్- హరీశ్ శంకర్ కాంబినేషన్ లో మరో ఫిల్మ్ రాబోతున్నది. అదే ‘భవదీయుడు భగత్ సింగ్’. త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.