ఎడిట్ నోట్: కమలం ‘రేసుగుర్రాలు’..!

-

తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ గట్టిగానే కష్టపడుతుంది. బలమైన అధికార టీఆర్ఎస్‌ పార్టీకి చెక్ పెట్టి…నెక్స్ట్ తాము అధికార పీఠం దక్కించుకుని…తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలనే లక్ష్యంగా బీజేపీ నేతలు పనిచేస్తున్నారు. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు తెలంగాణలో బీజేపీకి బలం లేదు…2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకటే సీటు గెలుచుకుంది. అంటే బీజేపీ బలమెంత ఉందో అర్ధం చేసుకోవచ్చు…కానీ పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న దగ్గర నుంచి…తెలంగాణలో బీజేపీ దూకుడు మొదలైంది.

రెండు ఉపఎన్నికల్లో గెలవడం, జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో సత్తా చాటడం…ఇలా వరుసగా బీజేపీ దూకుడుగా రాజకీయాలు చేస్తూ వచ్చింది…దీంతో టీఆర్ఎస్ పార్టీకి పోటీగా బీజేపీ రాజకీయం చేస్తుంది. ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికలో గెలిచి సత్తా చాటాలని చూస్తుంది. టీఆర్ఎస్-బీజేపీల మధ్య వార్ తీవ్ర స్థాయిలో నడుస్తోంది. అయితే మునుగోడు విషయం పక్కన పెడితే…రాష్ట్ర స్థాయిలో కూడా రెండు పార్టీల మధ్య వార్ నడుస్తోంది.

అసలు టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అన్నట్లు పరిస్తితి వచ్చింది. రాజకీయ యుద్ధంలో అలా కనిపిస్తుంది గాని…క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ పార్టీతో పాటు బలంగా బీజేపీ లేదు. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కంటే వెనుకే ఉంది. కానీ ఇప్పుడుప్పుడే బీజేపీ బలం పెంచుకుంటూ వస్తుంది. అయితే బీజేపీ నెక్స్ట్ ఎన్నికల్లో గెలవాలంటే ప్రతి నియోజకవర్గంలో బలమైన నాయకుడు కావాలి. మరి బీజేపీకి అలాంటి నాయకులు ఉన్నారంటే..పెద్దగా లేరనే చెప్పాలి. అలాగే చాలా నియోజకవర్గాల్లో బలమైన కేడర్ లేదు.

కాకపోతే బలమైన నాయకుడు ఉంటే ఆటోమేటిక్ గా కేడర్ కూడా వస్తుంది…కాబట్టి ఇప్పుడు బీజేపీకి గెలుపు గుర్రాలు కావాలి. అయితే ఆ మధ్య వచ్చిన మస్తాన్ సర్వేలో టీఆర్ఎస్ పార్టీకి 80 పైనే నియోజకవర్గాల్లో బలమైన నాయకులు ఉండగా, కాంగ్రెస్ పార్టీకి 50 పైనే స్థానాల్లో బలమైన నాయకులు ఉన్నారని తేలింది…కానీ బీజేపీకి మాత్రం కేవలం 30 లోపు స్థానాల్లో మాత్రమే బలమైన నాయకులు ఉన్నారని తేల్చి చెప్పారు.

అంటే బీజేపీకి ఇంకా ఎంత బలం కావాలో ఊహించుకోవచ్చు. ఇక ఇప్పటికిప్పుడు బీజేపీలో బలమైన నాయకులని తయారు చేయడం కష్టం…కాబట్టి టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల్లో ఉన్న బలమైన నాయకులని తీసుకుంటేనే బీజేపీకి గెలుపు అవకాశాలు మెరుగు అవుతాయని ఆ సర్వే చెప్పింది. ఇక ఆ దిశగానే బీజేపీ ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా బండి సంజయ్ కూడా…గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తామని ప్రకటించారు.

ఇక ఆ గెలుపు గుర్రాలని ఎంచుకోవడమే బీజేపీ పని…ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలతో పాటు…బీజేపీలో దూకుడుగా పనిచేసే నేతలు కూడా ఉన్నారు. వారు రోజురోజుకూ పుంజుకుంటున్నారు. అలాంటి వారికి కూడా సీట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే రేసు గుర్రాలతోనే బీజేపీ బండి నడవాల్సింది…ఇందులో ఎలాంటి పొరపాటు జరిగిన బీజేపీకి చిక్కులు తప్పవు. మరి బీజీపీకి రేసు గుర్రాలు దొరుకుతారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news