ఎడిట్ నోట్: దిగజారిన ‘రాజకీయం’..!

-

ఒకప్పుడు రాజకీయాలు అంటే నిర్మాణాత్మకమైన విమర్శలు.. పాలసీ పరమైన విభేదాలు ఉండేవి.. వ్యక్తి పూజ, వ్యక్తిగత దూషణలు ఉండేవి కావు. అయితే రాను రాను రాజకీయం దిగజారిపోతుంది.. వ్యక్తి పూజలు, వ్యక్తిగత దూషణలు, దాడులే నేటి రాజకీయమైంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి దిగజారిన రాజకీయం నడుస్తోంది. అయితే ఇదంతా ఏపీలో ఎక్కువగా ఉందని అనుకోవచ్చు.. కానీ ఇప్పుడు తెలంగాణలో కూడా ఎక్కువైంది.

నేతలు బూతులు తిట్టుకోవడం, అవసరమైతే దాడులు చేసేవరకు వెళ్లిపోతున్నారు. అంటే అంత వ్యక్తిగత కక్షలు పెంచుకుంటున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తోంది. ఎవరికి వారు పైచేయి సాధించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో దారుణమైన పదజాలం వాడుతూ.. ఒకరినొకరు దూషించుకుంటున్నారు. బూతులు తిట్టుకుంటున్నారు. అటు టీఆర్ఎస్ నేతలు గాని, ఇటు బీజేపీ నేతలు గాని అదే పనిలో ఉన్నారు.

అయితే బీజేపీ నేతలే బూతులు తిడుతున్నారని టీఆర్ఎస్ నేతలు సూక్తులు చెప్పడానికి చూస్తున్నారు.. కానీ ఈ బూతుల రాజకీయం మొదలుపెట్టిందే కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు అని, ఉద్యమ సమయంలో ఎలాంటి బాష మాట్లాడారో తెలుసని, అలాగే అధికారంలోకి వచ్చాక ప్రత్యర్ధి నేతల గురించి ఎలాంటి మాటలు మాట్లాడారో తెలుసని బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఏదేమైనా గాని రెండు పార్టీల నేతలు దారుణంగా తిట్టుకుంటున్నారు.

ఆఖరికి కేసీఆర్ కుమార్తె కవిత సైతం దూషణలు మొదలుపెట్టారు. బీజేపే ఎంపీ అరవింద్ టార్గెట్ గా కొడతాం, చంపుతాం బిడ్డ, చెప్పుతో కొడతా అంటూ రెచ్చిపోయారు. అటు అరవింద్ సైతం తీవ్ర స్థాయిలోనే కౌంటర్ ఇచ్చారు. “మీ నాన్నని ఏమన్నా చెప్పుతో కొట్టానా.. నన్ను చెప్పుతో కొట్టడానికి” అంటూ తీవ్ర వ్యాఖ్య చేశారు. అయితే ఇదంతా ఇటీవల కేసీఆర్.. తన కుమార్తెని సైతం బీజేపీలోకి లాగడానికి చూశారని అనడంతో వచ్చింది. అసలు ఓడిపోయిన కవితని తీసుకోవాల్సిన అవసరం లేదని, ఆమె కాంగ్రెస్‌లో చేరడానికి చూశారని, మల్లిఖార్జున్ ఖర్గేతో మాట్లాడారని బీజేపీ నేతలు అన్నారు.. అదే అంశాన్ని అరవింద్ కూడా చెప్పారు.

దీంతో కవిత ఫైర్ అయిపోయారు..ఫైర్ అవ్వడమే కాదు కొందరు టీఆర్ఎస్ నేతలు అరవింద్ ఇంటిపై దాడి కూడా చేశారు. అయితే ఏమైనా విమర్శలు వస్తే టీఆర్ఎస్ నేతలు ఇలా దాడులు చేయడానికి చూస్తున్నారు. సరే తిట్టుకోవడం ఎలాగో ఉంది.. ఈ దాడులు ఏంటి అని సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్తితి. రాజకీయాల్లో ఇలాంటి సంస్కృతి ఏ మాత్రం మంచిది కాదనే చెప్పాలి. మరి ఈ రచ్చ కొనసాగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news