ఎడిట్ నోట్: క్లాస్ పీకుతున్నారుగా..!

ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది అయినా…సరే ఇప్పటినుంచే ఏపీలో ఎన్నికల వాతావరణం ఉంది…వైసీపీ-టీడీపీల మధ్య జరిగే రాజకీయాన్ని చూస్తుంటే..ఇప్పుడే ఎన్నికల జరగబోతున్నాయా? అన్నట్లు రాజకీయ వాతావరణం ఉంది. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడం రెండు పార్టీలకు చాలా కీలకం. అదేంటి ఇప్పుడు వైసీపీ అధికారంలోకి ఉంది కదా..ఇంకేంటి ఇబ్బంది అనుకోవచ్చు. ఇక్కడే కొన్ని కారణాలు ఉన్నాయి. నెక్స్ట్ వైసీపీకి కూడా అధికారంలోకి రావడం చాలా ముఖ్యం.

ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎలాంటి పరిణామాలు రాష్ట్రంలో చోటు చేసుకున్నాయో చెప్పాల్సిన పని లేదు. వాస్తవ పరిస్తితులని మాట్లాడుకోవాలంటే…గతంలో టీడీపీ హయాంలో పడిన ఇబ్బందికి రెట్టింపు స్థాయిలో వైసీపీ రివెంజ్ తీర్చుకుందని చెప్పొచ్చు. టీడీపీ నేతలకు, కార్యకర్తలకు చుక్కలు చూపించారు.

దీంతో టీడీపీ వాళ్ళు ఎప్పుడు అధికారంలోకి వస్తామా? ఎప్పుడు వైసీపీపై రివెంజ్ తీర్చుకోవాలని కసితో రగిలిపోతున్నారు. కసి మీద ఉన్న టీడీపీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ఊహించుకోవచ్చు. అదే సమయంలో మళ్ళీ వైసీపీ గాని అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో చెప్పనవసరం లేదు. టీడీపీ పరిస్తితి మరీ దారుణంగా తయారవుతుంది.

అంటే రెండు పార్టీలకు అధికారంలోకి రావడం అనేది ముఖ్యమే. అందుకే ఇటు జగన్ గాని, అటు చంద్రబాబు గాని…మళ్ళీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో సొంత పార్టీలో ఉండే తప్పులని కూడా సరిచేయాలని చూస్తున్నారు. పార్టీలో తప్పులు పెట్టుకుని ముందుకెళ్లడం కష్టం. అందుకే ముందు సొంత పార్టీని లైన్ చేస్తున్నారు. ఈ క్రమంలో సరిగ్గా పనిచేయని నేతలకు జగన్-చంద్రబాబు గట్టిగానే క్లాస్ తీసుకుంటున్నారు.

ఆ మధ్య వైసీపీ వర్క్ షాపులో జగన్…ఎమ్మెల్యేలకు గట్టిగా క్లాస్ తీసుకున్నారు…గడప గడపకు అందరూ వెళ్లాలని, ప్రజా మద్ధతు పెంచుకోవాలని, అలా చేయని వారికి నెక్స్ట్ సీటు కూడా ఇవ్వనని చెప్పేశారు. ఇక తాజాగా మంత్రులకు కూడా క్లాస్ ఇచ్చారు..ప్రతిపక్ష టీడీపీ చేసే విమర్శలపై మంత్రులు సరిగ్గా ఎదురుదాడి చేయడం లేదని, అలాగే గడప గడపకు సరిగ్గా వెళ్ళడం లేదు. అలా చేయకపోతే మంత్రి పదవి పీకేస్తానని వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే నెక్స్ట్ ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వనని అంటున్నారు.

ఇటీవల టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు కూడా…టీడీపీ నేతలకు గట్టిగా క్లాస్ ఇచ్చారు. నియోజకవర్గాల్లో సరిగ్గా పనిచేయకుండా, బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లని వారికి వార్నింగ్ ఇచ్చారు. కేసులకు భయపడి పోరాటాలు చేయని వారికి క్లాస్ తీసుకున్నారు. ఇలాగే ఉంటే మొహమాటం లేకుండా పక్కన పెట్టేసి…వారి ప్లేస్‌లో వేరే వారికి ఇంచార్జ్ పదవి ఇస్తానని చెప్పారు.

ఇక ఎవరైనా టీడీపీ నేతపై గాని, కార్యకర్తపై గాని దాడి జరిగినా, కేసులు పెట్టి అరెస్ట్ చేసినా సరే…ఆయా జిల్లాల్లో ఉండే నేతలు వాటిని ఖండించాలని, పోరాటాలు చేయాలని, పరామర్శించాలని చెప్పారు. తాజాగా కృష్ణా జిల్లాలో టీడీపీ నేత చెన్నుపాటి గాంధీపై వైసీపీ నేతలు దాడి చేయగా, ఆయన కన్ను కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటనపై కృష్ణా జిల్లా టీడీపీ నేతలు సరిగ్గా స్పందించలేదని చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. గాంధీని పరామర్శించని, ఈ అంశంపై సరిగ్గా పోరాటం చేయడం లేదని, ఇలాగే ఉంటే లాభం లేదని, ఇకనైనా తీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. అంటే జగన్ గాని, ఇటు చంద్రబాబు గాని అధికారంలోకి రావడం కోసం సొంత పార్టీ నేతలకే గట్టిగా క్లాస్ పీకేస్తున్నారు.