నేటి రాజకీయాల్లో మీడియా పాత్ర ఎంతవరకు పెరిగిపోయిందో చెప్పాల్సిన పని లేదు..మీడియానే రాజకీయాలని నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది. పైగా ఎవరికి వారికి సొంత మీడియా సంస్థలు ఉన్నాయి. ఎవరి భజన వారు చేసుకుంటారు. ప్రత్యర్ధులపై నెగిటివ్ గా కథనాలు రాస్తారు. ఇలా మీడియా రాజకీయ పార్టీలకు భజన సంస్థలుగా మారిపోయాయి. ఇక ఏపీలో కూడా అధికార వైసీపీకి అనుకూల మీడియా ఉంది..ప్రతిపక్ష టీడీపీకి అనుకూల మీడియా ఉంది.
అయితే ఈ మీడియా సంస్థలు రాసే కథనాలు ఒకోసారి మరీ దారుణంగా ఉంటాయి. అసలు అన్నీ తమకే తెలిసినట్లే రాసేస్తాయి. తాజాగా టీడీపీ అనుకూల మీడియా ఓ కథనం ఇచ్చింది. ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో షర్మిల హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఆమె పాదయాత్రపై టీఆర్ఎస్ శ్రేణులు రాళ్ళు రువ్వాయి. వాహనాలని ధ్వంసం చేశారు. ఆ తర్వాత షర్మిల కారులో ఉండగానే..ట్రాఫిక్ వాళ్ళు ఆమె కారుని లాక్కుని వెళ్లారు. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీలో జీ-20పై జరిగిన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆ సమావేశం తర్వాత తేనీటి విందు వద్ద మోదీని జగన్ కలుసుకున్నారట. జగన్‌ను చూడగానే షర్మిల అంశాన్ని మోదీ ప్రస్తావించారట. ‘‘మీ చెల్లెలు షర్మిల కారులో ఉండగానే క్రేన్‌తో లాక్కెళ్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారటకదా! ఇంత జరిగినా మీరెందుకు స్పందించలేదు?’’ అని జగన్‌ను ప్రశ్నించారట.
ప్రధాని నుంచి ఇలాంటి ప్రశ్న ఎదురవుతుందని ఊహించని జగన్… ఒక్కసారిగా దిగ్ర్భాంతికి గురయ్యారని కథనం ఇచ్చారు. ఇక ఏం సమాధానం చెప్పాలో తెలియక ఎప్పటిలాగానే తన మార్కు నవ్వుతో మౌనంగా నిల్చున్నారని చెప్పుకొచ్చింది. అటు మోదీ సైతం జగన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో… మరో నేతను పలకరించేందుకు ముందుకు వెళ్లారట. ఇదంతా టీడీపీ అనుకూల మీడియాలో కథనం వచ్చింది. అసలు ఇందులో వాస్తవం ఏంటో ఎవరికి తెలియదు. పైగా మోదీ-జగన్ మాట్లాడుతుంటే మధ్యలో ఆ మీడియా ఉండి అంతా చూసి, విన్నట్లు రాసుకొచ్చింది. అసలు వాస్తవాలు ఏంటో క్లారిటీ లేదు..కానీ ఓ ఊహాజనిత కథనం మాత్రం వదిలింది. మరి దీన్ని ప్రజలు ఎంతవరకు నమ్ముతారో చూడాలి.