ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం జగన్ సీఎం అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజునే.. అదే వేదికపై సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై ప్రకటన చేస్తారని తెలిసింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని, అందుకోసం ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తామని ఎప్పటి నుంచో చెబుతున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే ఆయన గతంలో ఆయా రాష్ట్రాలకు చెందిన పలు పార్టీల అగ్రనేతలను కూడా కలిశారు. ఇక ఇప్పుడు మరోసారి అదే పంథాలో ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం కేరళ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఆ రాష్ట్ర సీఎంను కూడా కలిశారు. అయితే ఫెడరల్ ఫ్రంట్‌ను ఎప్పుడు ఏర్పాటు చేస్తామనే విషయంలో మాత్రం కేసీఆర్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కానీ అందుకు ముహూర్తం మాత్రం ఖరారైనట్లు తెలుస్తోంది.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం జగన్ సీఎం అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజునే.. అదే వేదికపై సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై ప్రకటన చేస్తారని తెలిసింది. ఎందుకంటే.. కేంద్రంలో ఈసారి బీజేపీ, కాంగ్రెస్‌లకు పూర్తి స్థాయి మెజారిటీ వచ్చే అవకాశం లేదని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో.. కచ్చితంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యమవుతుందని కేసీఆర్ ఆలోచిస్తున్నారట. ఇక ఆ ఫ్రంట్ ఏర్పాటుకు జగన్ సీఎంగా ప్రమాణం చేసే వేదికే సరైందని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకనే ఆయన ఆ వేదికపైనే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రకటన చేస్తారని తెలిసింది.
ఇక జగన్ సీఎం ప్రమాణస్వీకారోత్సవానికి దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన పార్టీల అగ్ర నాయకులను పిలిచి అదే వేదికపై సీఎం కేసీఆర్ వారితో ఫెడరల్ ఫ్రంట్ బలనిరూపణ కూడా చేస్తారని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించే పార్టీల నేతలను సీఎం కేసీఆర్ జగన్ ప్రమాణ స్వీకారానికి పిలుస్తారని, దీంతో అదే వేదికపై ఫెడరల్ ఫ్రంట్‌ను ప్రకటించి.. బలనిరూపణ కూడా చేస్తారని తెలిసింది. అయితే.. ఇది జరగాలంటే ఎన్నికల ఫలితాల్లో వైసీపీ గెలవాలి. జగన్ సీఎం కావాలి. మరి అందుకోసం ఈ నెల 23వ తేదీ వరకు వేచి చూడక తప్పదు..!