ఎడిట్ నోట్: కారులో పోరు!

-

రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రత్యర్ధులతో పోరు ఉంటే బాగుంటుంది తప్ప..సొంత పోరు ఉంటే ఏ మాత్రం బాగోదనే చెప్పాలి. ప్రత్యర్ధులతో పోరు వల్ల రాజకీయంగా ఏదొక సమయంలో లాభం జరగొచ్చు..కానీ సొంత పోరు వల్ల రాజకీయంగా నష్టమే తప్ప లాభం ఉండదు. ఇప్పుడు తెలంగాణలో అధికారంలో టీఆర్ఎస్ పార్టీకి కూడా నష్టమే జరిగేలా ఉంది. ఇప్పటివరకు తెలంగాణలో కాంగ్రెస్ లో మాత్రమే వర్గ పోరు కనిపించింది…కానీ గత కొంతకాలం నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీలో తారస్థాయిలో వర్గపోరు కనబడుతుంది.

రాష్ట్రంలో దాదాపు చాలా నియోజకవర్గాల్లో సొంత పార్టీలోనే గ్రూపులు వచ్చాయి…ఈ గ్రూపుల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తోంది..ఒకవేళ రాష్ట్రంలో టీఆర్ఎస్ బలంగా ఉంటే ఈ వర్గ పోరు అంతగా బయటపడేది కాదేమో..కానీ నిదానంగా టీఆర్ఎస్ వీక్ అవుతుండటంతో…గ్రూపు తగాదాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. పోనీ ఈ గ్రూపు తగాదాలు ఒకచోటకు పరిమితమైతే పర్లేదు…అక్కడ చిన్న ఇష్యూస్ ఉన్నాయని అనుకోవచ్చు…కానీ చాలా నియోజకవర్గాల్లో కారు నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.

ముఖ్యంగా జంపింగ్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పోరు తారస్థాయిలో నడుస్తోంది. ఇప్పటికే పలు చోట్ల నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. తాజాగా మహేశ్వరం నియోజకవర్గంలో ‘కారు చిచ్చు’ చెలరేగింది. ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి గెలిచి సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ లోకి వచ్చారో అప్పటినుంచి రచ్చ మొదలైంది. సబితాపై పోటీ చేసి ఓడిపోయిన టీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి..సబితా చేరికపై అసంతృప్తిగానే ఉన్నారు.

పైగా ఆమెకు కేసీఆర్ మంత్రి పదవి కూడా ఇచ్చారు…దీంతో మహేశ్వరంలో సబితా వర్గానిదే పైచేయి…తీగల వర్గానికి ఏ మాత్రం ప్రాధాన్యత లేకుండా పోయింది. ఏ కార్యక్రమం చేయాలన్న సబితా వర్గం హడావిడి ఎక్కువ ఉంటుంది. దీంతో తీగల సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది…అయితే ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న తీగల…సడన్ గా బయటకొచ్చి ఫైర్ అయ్యారు…సబితా వల్ల మహేశ్వరంలో పార్టీ నాశనమవుతుందని, సబితా వర్గం భూ కబ్జాలు, దందాలు చేస్తుందని ఆరోపించారు.

అలాగే నెక్స్ట్ సబితాకు సీటు ఇస్తే ఖచ్చితంగా గెలవరని అంటున్నారు…పైగా తాను మహేశ్వరం నుంచి పోటీ చేస్తానని అంటున్నారు…కానీ ఏ పార్టీ అనేది చెప్పడం లేదు. దాదాపు సీటు సబితాకు ఫిక్స్ అయినట్లే…అందుకే ఆయన…సబితా ఓడిపోతుందని మాట్లాడుతున్నారు. అంటే ఈయన వేరే పార్టీ నుంచి బరిలో దిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ విధంగా మహేశ్వరంలో టీఆర్ఎస్ రెండు వర్గాలుగా చీలిపోయింది..దీని వల్ల టీఆర్ఎస్ పార్టీకి పెద్ద డ్యామేజ్ అయ్యేలా ఉంది.

మహేశ్వరం మాత్రమే కాదు…

తాండూరు, కొల్లాపూర్, పినపాక, ఇల్లందు, నకిరేకల్, భూపాలపల్లి, వైరా, పాలేరు, సత్తుపల్లి..ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నియోజకవర్గాల్లో కారు పార్టీలో వర్గ పోరు నడుస్తోంది..మరి ఇంత రచ్చ నడుస్తున్నా సరే టీఆర్ఎస్ అధిష్టానం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. మొత్తానికి ఈ వర్గ పోరు వల్ల కారుకు ఫుల్ డ్యామేజ్ జరిగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news