ఎడిట్ నోట్: ఢిల్లీ గద్దె ఎక్కడం సులువా..!

రాష్ట్రంలో తమని టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్న బీజేపీకి…అదే రాజకీయం ద్వారా కేంద్రంలో చెక్ పెట్టాలని కేసీఆర్ గట్టిగానే ట్రై చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ దూకుడుగా రాజకీయం చేస్తుంది…ఈ సారి ఎలాగైనా కేసీఆర్‌ని గద్దె దింపాలని గట్టిగా కష్టపడుతున్నారు. అయితే ఇంకాస్త కష్టపడితే తెలంగాణలో బీజేపీ గద్దెనెక్కే అవకాశాలు ఉన్నాయి.

కానీ కేంద్రంలో బీజేపీని గద్దె దించి…బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెబుతున్నారు. జాతీయ రాజకీయ ప్రస్థానం మొదలుపెడుతున్నానని తాజాగా నిజామాబాద్‌ సభలో కేసీఆర్ ప్రకటించారు. ఢిల్లీ గద్దెపై మన ప్రభుత్వమే రానుందని, కేంద్రంలో 2024 ఎన్నికల తర్వాత బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు కానుందని, వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో మన ప్రభుత్వం ఏర్పాటైతే దేశవ్యాప్తంగా రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్తును ఇస్తామని, తెలంగాణ పథకాలన్నింటినీ అమలు చేస్తామని చెప్పారు.

అంటే కేంద్రంలోప్ బీజేపీయేతర ప్రభుత్వం రావడం..పైగా తెలంగాణ పథకాలు అమలు చేస్తామనే కేసీఆర్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. సరే రాజకీయాల్లో ఏదైనా చేయొచ్చు…ఏదైనా జరగొచ్చు. కానీ అన్నివేళలా అనుకున్నది జరగకపోవచ్చు. ప్రస్తుతం రాజకీయ పరిస్తితులని గమనిస్తే…తెలంగాణలో టీఆర్ఎస్ గద్దె దిగే అవకాశాలు కాస్త ఉన్నాయి. కానీ దేశ రాజకీయాలని చూస్తే…కేంద్రంలో ఎన్డీయే గద్దె దిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రతిపక్ష కాంగ్రెస్ చాలా వీక్ గా ఉంది..ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలే ఎక్కువగా ఉన్నాయి. నాయకత్వ లోపం ఉంది.

సరే కాంగ్రెస్‌ని కాదని వేరే పార్టీలు లీడ్ తీసుకున్నా సరే…బీజేపీ అంత బలం ఏ పార్టీకి లేదు. ఎక్కడకక్కడ రాష్ట్రాలకు పరిమితమైన పార్టీలే ఉన్నాయి. అయితే కేసీఆర్…బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నిటిని ఏకం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే విపక్ష నేతలని వరుసగా కలిశారు. ఇక పై కేంద్ర రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెట్టి పనిచేస్తారని తెలుస్తోంది. కానీ విపక్ష పార్టీలు ఏకమైన సరే…తప్పనిసరిగా కాంగ్రెస్ మద్ధతు ఉండాలి..అలాగే కాంగ్రెస్‌ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు కూడా ఉన్నాయి. వీటి అన్నిటిని ఏకం చేయాలి.

అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముందే జరుగుతాయి కాబట్టి…ఆ ఎన్నికలు అయ్యాక…కేసీఆర్ కాంగ్రెస్‌కు దగ్గర అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా అని కేసీఆర్‌ని మళ్ళీ నమ్మి కాంగ్రెస్ దగ్గరవ్వడం కష్టమైన పని. అయినా ఇన్ని పార్టీలతో ఐకమత్యంగా ఉండటం చాలా కష్టం. పైగా ఎవరికి వారే ప్రధాని అభ్యర్ధి అని భావిస్తారు. విపక్ష పార్టీలు అన్నీ కలిసినా సరే…బీజేపీకి చెక్ పెట్టడం జరిగే పని కాదని అర్ధమవుతుంది.

కానీ ఏదొకవిధంగా బీజేపీని గద్దె దించాలని కేసీఆర్ పోరాటం మాత్రం చేస్తున్నారు…అంత తేలికగా మాత్రం కేసీఆర్ పోరాటం ఫలించే అవకాశాలు కనిపించడం లేదు. ఢిల్లీలో బీజేపీని గద్దె దించడం సులువు కాదు…అలాగే బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడటం కూడా అంత ఈజీ కాదు. మరి రానున్న రోజుల్లో కేసీఆర్ రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి.