ఎడిట్ నోట్: కేసీఆర్..కింకర్తవ్యం?

-

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఊహించని షాక్ తగిలిందని చెప్పవచ్చు..ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న సిట్ చేతుల్లో ఉన్న ఈ కేసుని తాజాగా హైకోర్టు..సీబీఐకు బదిలీ చేస్తూ తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజి, ప్రతిపాదిత నిందితులు తుషార్‌, భూసారపు శ్రీనివాస్‌ తదితరులు దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌లపై తాజాగా జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం తీర్పు వెలువరించింది.

విచారణ కంటే ముందుగానే ఈ కేసుకు సంబంధించి ఆడియో, వీడియో క్లిప్‌లు బయటకు రావడం, వాటిని కేసీఆర్ ప్రదర్శించారు. అసలు ఇవి ఎలా బయటకెళ్లాయో వివరణ ఇవ్వలేదు. అలా చేయడం వల్ల దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదేమో అన్న అనుమానాలు ఏర్పడ్డాయని కోర్టు పేర్కొంది. మొత్తం ఆధారాలు మీడియాకు చేరవేయడాన్ని సైతం ధర్మాసనం తప్పుబట్టింది. దీంతో మొయినాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇలా కేసు సీబీఐకి బదిలీ చేయడంతో కేసీఆర్‌కు ఊహించని షాక్ తగిలినట్లు అయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అధికార టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను రూ.400 కోట్లతో కొనుగోలు చేసేందుకు కొందరు ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పైలెట్‌ రోహిత్‌రెడ్డి (తాండూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్‌), రేగా కాంతారావు (పినపాక)ను ముగ్గురు మధ్యవర్తులు.. రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ, మరొకరు తిరుపతికి చెందిన సింహ యాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌.. ఎమ్మెల్యేలతో బేరసారాలు చేశారు.

ఈ కేసుని పకడ్బంధీగా పోలీసులు చేధించి…ఆ ముగ్గురు వ్యక్తులని అరెస్ట్ చేశారు..ఇక పట్టుబడిన ముగ్గురు నిందితులకు బెయిల్ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ కేసుని విచారించిన హైకోర్టు తాజాగా ఈ కేసుని సి‌బి‌ఐకి అప్పగించింది. కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండే సి‌బి‌ఐ చేతికి కేసు రావడంతో..కేసీఆర్‌కు ఇబ్బందులు ఎదురవుతాయా? అనేది చూడాలి.  ఈ అంశాన్ని కేసీఆర్ ఎలా ఎదుర్కుంటారు..కేసీఆర్ తక్షణ కర్తవ్యం ఏంటి అనేది చూడాలి. మొత్తానికి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ ఇరుక్కోవడం పోయి..చివరికి బీఆర్ఎస్ చిక్కులో పడిందా? అనే పరిస్తితి. మరి చూడాలి చివరికి ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news