కొన్నిసార్లు సమాజంలో ఉన్న వాస్తవ పరిస్థితుల గురించి సినిమాల్లో చెప్పినా అది తమ మనోభావాలను కించపరిచిందని కొందరు గొడవలకు దిగుతున్నారు. దీంతో దర్శక నిర్మాతలకు వీక్షకుడి కోణంలో సినిమాలు తీయడం కష్టంగా మారింది.
మన దేశంలో జీవించే ఏ వ్యక్తికైనా సరే భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంది. అంటే.. ఎవరికైనా సరే.. తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉంటుంది. అయితే ఆ హక్కు ఉంది కదా.. అని ఎవరూ కూడా ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడకూడదు. అభిప్రాయాలను వెల్లడించడానికి, ఇతరులను కించ పరిచేలా మాట్లాడేందుకు మధ్య ఒక సన్నని గీత ఉంటుంది. అది ఎవరికీ కనిపించదు. కానీ కొన్ని సందర్భాల్లో కొందరు ఆ పరిధి దాటుతుంటారు. అయితే అలా ప్రవర్తించడం సమాజం బాగు కోసమే అయితే ఫర్వాలేదు. కానీ.. దాంతో వివాదం చేయాలని, ఇంకొకరికి నష్టం చేయాలని మాత్రం చూడకూడదు. అయితే మన సమాజంలోని కొందరికి మాత్రం ఇదే పరమావధిగా మారింది. చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూస్తూ అనవసరంగా వివాదాలను సృష్టిస్తున్నారు. ఇతరులకు నష్టం చేయాలన్నదే ధ్యేయంగా వారి చర్యలు ఉంటున్నాయి.
సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు కథా రచయితలకే కాదు, దర్శకులకు సంపూర్ణ స్వేచ్ఛ ఉండేది. వారు సమాజంలోని పరిస్థితులను సినిమాల్లో అచ్చు గుద్దినట్లు చూపించేవారు. కానీ రాను రాను పలువురు ఈ భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకుంటున్నారు. ఏమైనా అంటే.. తమ మనోభావాలు దెబ్బ తిన్నాయని వాదిస్తున్నారు. అయితే సమాజంలో ఉన్న ఎవరూ ఇంకొకరిని కించ పరిచే విధంగా పనులు చేయరు. కొన్నిసార్లు సమాజంలో ఉన్న వాస్తవ పరిస్థితుల గురించి సినిమాల్లో చెప్పినా అది తమ మనోభావాలను కించపరిచిందని కొందరు గొడవలకు దిగుతున్నారు. దీంతో దర్శక నిర్మాతలకు వీక్షకుడి కోణంలో సినిమాలు తీయడం కష్టంగా మారింది. ఏమైనా అంటే.. మనోభావాలు దెబ్బతింటున్నాయని అనడం ఫ్యాషన్ అయిపోయింది. ఇందుకు తాజాగా నెలకొన్న వాల్మీకి సినిమా వివాదమే ప్రత్యక్ష ఉదాహరణ.
కొన్నేళ్ల కిందట వచ్చిన పద్మావతి సినిమా గుర్తుంది కదా. అందులో తమ వర్గానికి చెందిన స్త్రీని తప్పుగా చూపించారని ఆరోపిస్తూ ఆ వర్గానికి చెందిన వారు ఆ సినిమా విడుదలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో చిత్ర వర్గాలు ఆ సినిమాలో అలాంటి సీన్లు ఏవీ లేవని చెప్పినా వారు వినలేదు. దీంతో చిత్రయూనిట్ పేరు మార్చి ఆ సినిమాను విడుదల చేసింది. అప్పటితో ఆ వివాదం సద్దుమణిగింది. అయితే వాల్మీకి సినిమా నేపథ్యం వేరే..! ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టకూడదని ఓ వర్గానికి చెందిన వారు కోర్టుకెక్కారు. విజయం సాధించారు. ఫలితంగా మరోపేరుతో ఆ సినిమా వచ్చింది. కరెక్టే.. మనోభావాలు దెబ్బ తింటే ఆ విధమైన చర్యలకు ఎవరైనా పూనుకోవాల్సిందే.. కాదనలేం. కానీ.. వారు స్పందించిన సమయం కరెక్ట్ కాదు.
వాల్మీకి సినిమాకు ఆ టైటిల్ ఫిక్స్ చేసినప్పటి నుంచి విడుదలయ్యే వరకు ఆగి విడుదలకు ముందు ఆ వర్గం వారు ఫిర్యాదు చేయడం.. దీంతో చిత్రయూనిట్‌కు గత్యంతరం లేక మరొక టైటిట్ వెదుక్కోవడం, అందుకు తగిన డిజైన్లు చేసుకుని పోస్టర్లను, యాడ్స్‌ను రిలీజ్ చేయడం.. పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది. అదే సినిమా టైటిల్ ఫిక్స్ అయినప్పుడే స్పందించి ఆ పేరు పెట్టకూడదని చెబితే చిత్ర యూనిట్‌కు ఎంతో వెసులుబాటు ఉండేది. కానీ తీరా విడుదలకు ముందు రోజు వివాదం చేస్తే ఆ సినిమా తీసిన వారికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. కొన్ని కోట్ల రూపాయలు అప్పు తెచ్చి, ఎంతో మంది శ్రమకోర్చి తీర్చిదిద్దే సినిమాకు నిజంగా ఇలాంటి కష్టం వస్తే.. వారి కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.
మనోభావాలు దెబ్బ తింటాయనే నెపంతో కేవలం ఇంకొకరికి నష్టం చేయడానికే పూనుకుంటే అది సహేతుకం కాదు. ఇక్కడ అలాంటి చర్యలకు పాల్పడే వారిని విమర్శించడం కాదు.. నిజంగా తమ మనోభావాలు దెబ్బ తింటాయనుకుంటే సమస్య మొదలైనప్పుడే స్పందించి ఉంటే బాగుండేది.. అన్న విషయం చెప్పడం కోసమే ఈ తాపత్రయమంతా.. అంతే కానీ కేవలం ఒకరికే సపోర్ట్‌గా మాట్లాడుతున్నామని కాదు. అలాంటి సందర్భాల్లో వీలైనంత త్వరగా స్పందించాలన్నదే మా ఉద్దేశం. దాంతో ఎవరికీ ఎలాంటి నష్టం కాకుండా ఉంటుంది..!