కేవలం ఉద్యోగాలు చేసే దంపతులు మాత్రమే కాదు.. బ్యాచిలర్స్ కూడా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ బాట పడుతున్నారు. వండడం అంతా ఎందుకు దండగ.. ఫుడ్ డెలివరీ యాప్‌లు ఉండగా.. అని చెప్పి ఇండ్లలో వండడమే మానుకున్నారు.
”ప్రసాద్, దీప్తి.. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. వేర్వేరు కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఏదో ఒకటి చేసుకు తిని, మధ్యాహ్నం లంచ్‌కు ఇంత అన్నం వండుకుని బాక్సులు కట్టుకుని ఆఫీసులకు వెళ్లిపోతారు. ఇక ఆఫీసులో ఉండే పనికి భేజా ఫ్రై అయిపోతుంది. దీంతో ఇంటికి ఆలస్యంగా చేరుకునే వారికి వండుకునే తీరిక దొరకదు. అందుకనే వారు ఇంటికి చేరుకుంటామనే సమయానికి సరిగ్గా ఫుడ్ ఆర్డర్ వచ్చేలా ఏకంగా ఆన్‌లైన్‌లోనే భోజనాన్ని ఆర్డర్ చేస్తున్నారు. రోజూ ఇదే తంతు.. దీనికి తోడు ఫుడ్ డెలివరీ యాప్‌లలో ఉండే ఆఫర్ల వల్ల డబ్బు కూడా ఆదా చేస్తున్నారు..!” ఇదీ.. ప్రస్తుతం సగటు నగర జీవులు అనుభవిస్తున్న జీవన విధానం..!
అయితే కేవలం ఉద్యోగాలు చేసే దంపతులు మాత్రమే కాదు.. ఆ మాటకొస్తే బ్యాచిలర్స్ కూడా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ బాట పడుతున్నారు. వండడం అంతా ఎందుకు దండగ.. ఫుడ్ డెలివరీ యాప్‌లు ఉండగా.. అని చెప్పి ఇండ్లలో వండడమే మానుకున్నారు. ఎప్పుడో వీలు కుదిరితే తప్ప ఇప్పుడు చాలా మంది ఇండ్లలో వండడాన్ని ఎప్పుడో మానేశారు. ఇక ఐటీ, కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే వారైతే ఇంటి ఫుడ్డు కన్నా బయటి ఫుడ్డుకే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. అందుకే ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్‌ల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా మారింది.
సాధారణంగా మనం ఇండ్లలో వంట చేసుకుంటే ఏదో ఒక పప్పో, కూరనో, పచ్చడో చేసుకుని తింటాం. కానీ ఆన్‌లైన్‌లో ఫుడ్ డెలివరీ అయితే ఎంచక్కా రోజుకో వెరైటీ రుచిని ట్రై చేయవచ్చు. అలాగే ఆయా ఫుడ్ డెలివరీ యాప్‌లలో ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లను కూడా అందిస్తున్నారు. దీంతో చాలా మంది ఇంటి ఫుడ్ కన్నా బయటి ఫుడ్‌ను తినేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఇక నిరుద్యోగ యువతకు ఈ రంగం వల్ల ఉపాధి కూడా లభిస్తోంది. చాలా మంది పార్ట్‌టైం లేదా ఫుల్ టైం ఫుడ్ డెలివరీలు చేస్తూ ఉపాధి పొందుతున్నారు.
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ బిజినెస్ సాధారణ రోజుల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఇక పండుగలు, సెలవు దినాలు, ఇతర ప్రత్యేక రోజుల్లో రెస్టారెంట్ల వద్ద ఫుడ్ ఆర్డర్ తీసుకునే డెలివరీ బాయ్స్ పెద్ద ఎత్తున క్యూలు కడుతుండడం ఇప్పుడు మనకు ఎక్కడ చూసినా కనిపిస్తోంది. పలు ప్రముఖ నగరాలతోపాటు పట్టణాల్లోనూ ఇలాంటి క్యూలు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. దీంతో చాలా మంది హోటల్ వ్యాపారంలోకి కూడా అడుగు పెడుతున్నారు. హోటల్‌లో తినేలా కాకుండా ఫుడ్‌ను ఆన్‌లైన్ లో మాత్రమే డెలివరీ ఇచ్చేలా వ్యాపారం చేస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. మరి ముందు ముందు ఈ రంగం మనకు ఎలాంటి షాకులు ఇస్తుందో వేచి చూడాలి..!