వైకాపా అధినేత స‌పోర్ట్ బీజేపీకే..?

ఎగ్జిట్ పోల్స్ చెప్పిన‌ట్టుగా కాకుండా బీజేపీకి కొన్ని స్థానాలు త‌క్కువ‌గా వ‌చ్చి అప్పుడు టీఆర్ఎస్‌, వైకాపాలు ఎన్‌డీఏకు మ‌ద్ద‌తు ఇవ్వాల్సి వ‌స్తే.. ఏపీ , తెలంగాణ రాష్ట్రాల‌కు అది లాభిస్తుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.

దేశ వ్యాప్తంగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డేందుకు మ‌రో 3 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. అయితే ఇప్ప‌టికే ఎగ్జిట్ పోల్స్ వ‌చ్చేశాయి. ఈ క్ర‌మంలో ఒక‌టి రెండు స‌ర్వేలు మిన‌హా ఈ సారి కేంద్రంలో బీజేపీయే అధికారంలోకి వ‌స్తుంద‌ని చెప్పాయి. అలాగే ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని తేల్చాయి. దీంతో వైసీపీ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇక ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ మాత్రం ఈ నెల 23వ తేదీన నిజంగానే త‌మకు అనుకూలంగా ఫ‌లితాలు వ‌స్తే.. కేంద్రంలో ఏ పార్టీతో జ‌ట్టు క‌ట్టాల‌నే విష‌య‌మై ఇప్ప‌టికే ఓ అంచ‌నాకు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

ఈసారి కేంద్రంలో బీజేపీయే అధికారంలోకి వ‌స్తుంద‌ని ఎగ్జిట్ పోల్స్ చెప్ప‌డంతో వైకాపా అధినేత జ‌గ‌న్ 23వ తేదీన ఫ‌లితాలు వెలువ‌డి తాము అధికారంలోకి వ‌స్తే.. అటు కేంద్రంలో బీజేపీకే స‌పోర్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఎందుకంటే.. ఇప్ప‌టికే ఏపీ సీఎం చంద్ర‌బాబు యూపీఏతో క‌ల‌సి ఉన్నారు. అలాగే కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తిచ్చేది లేద‌ని గ‌తంలోనే జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. క‌నుక జ‌గ‌న్ పార్టీ మ‌ద్ద‌తు బీజేపీకే ఉంటుంద‌ని తెలిసింది.

అయితే ఎగ్జిట్ పోల్స్ చెప్పిన‌ట్టుగా కాకుండా బీజేపీకి కొన్ని స్థానాలు త‌క్కువ‌గా వ‌చ్చి అప్పుడు టీఆర్ఎస్‌, వైకాపాలు ఎన్‌డీఏకు మ‌ద్ద‌తు ఇవ్వాల్సి వ‌స్తే.. ఏపీ , తెలంగాణ రాష్ట్రాల‌కు అది లాభిస్తుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. బీజేపీకి మ‌ద్ద‌తు ఇచ్చే ప‌క్షంలో జ‌గ‌న్ ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌మ‌ని కోరే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుండగా, కేసీఆర్ తెలంగాణకు రావ‌ల్సిన నిధులు, ఇత‌ర ప్ర‌యోజ‌నాల‌ను అడిగే అవ‌కాశం ఉంది. దీంతో వారి డిమాండ్ల‌ను బీజేపీ క‌చ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఈ క్ర‌మంలో రెండు తెలుగు రాష్ట్రాల‌కు చాలా మేలు క‌లుగుతుంది. అయితే మరి బీజేపీ ఈ సారి సొంతంగా మెజార్టీ స్థానాలు సాధిస్తుందా, లేక మెజారిటీ కోసం ఇత‌ర పార్టీల వైపు చూస్తుందా.. అనేది మ‌రికొద్ది రోజుల్లో తేల‌నుంది..!