కంటిచూపు తగ్గుతోందా.. అయితే ఈ ఆహార పదార్థాలను తినటం అలావాటు చేసుకోండి..!

-

సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు.. అవును మనకున్న అవయువాలలో కళ్లను మించి అందంగా మరేది ఉండదేమో.. అందమైన ప్రపంచాన్ని ఇంకా అందంగా చూపెడతాయి. ఎదుటివ్యక్తిలో మనకు ముందు కనిపించెది కూడా కళ్లే..అందమైన నయనాలు..ఆ వ్యక్తిని ఇంకా అందంగా ఉంచుతాయ్. అంతెందుకు ఎంతోమంది కవులు కళ్లమీద కవితలు రాశారు..సినిమాల్లోనూ కళ్లమీద ఎన్ని హిట్ పాటలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మారుతున్న కాలంతో కళ్ల సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. వృథ్యాప్యంలో రావాల్సిన కంటిసమస్యలు స్కూల్ ఏజే లోనే వస్తున్నాయి. స్మార్ట్ ప్రపంచంలో లేట్ నైట్ వరకూ టీవీలు, ల్యాప్ టాప్ లు, ఫోన్లు చూడటం వల్ల కంటి చూపు తగ్గుతుంది. అయితే కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవటానికి ఎలాంటి ఆహార పదార్ధాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వీటిలో కొన్ని మనకు తెలిసే ఉంటాయ్ అనుకోండి. అయినా ఓ లుక్కేయండి..!

spinach

1. ఆకుకూరలు తింటే మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటాడు. జట్టుసమస్యలు కూడా ఉండవు. అందులోనూ పాలకూర వంటి ఆకుకూరల్లో ఫైబర్, విటమిన్ సీతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని సంరక్షించడలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే కంటి చూపు మెరుగుపడాలంటే ఆకుకూరలు తినాలని వైద్యులు పదే పదే చెబుతుంటారు.

2. చేపలు ఎక్కువగా తింటే కంటి చూపు మెరుగవుతుందని మన పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి కంటి సమస్యలను నివారించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ట్యూనా, సాల్మన్ వంటి చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. కానీ చాలామందికి చేపలు తినటం అంటే ఇష్టం ఉండదు. అన్నీ ముల్లు ఉంటాయి..అవి తీసుకోని తినటం పెద్ద లొల్లి అనుకుంటారు. కానీ కనీసం నెలకు ఒకసారైనా చేపలు తినటం మంచిది.

3. పాలు, పెరుగు..ఒక వర్గానికి ఇవి అంటే చెడ్డచిరాకు. ఆ వాసన కూడా పడదు. చాలామంది ఈ కారణంతోనే దూరంపెడుతుంటారు. కానీ పాలు, పెరుగులో విటమిన్ ఏ, జింక్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. విటమిన్ ఏ కార్నియాను రక్షించడంలో దోహదపడుతుంది. జింక్ కారణంగా కంటిశుక్లాలు తగ్గుతాయి.

4. గుడ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో వేరే చెప్పనక్కర్లేదు.. రోగనిరోధక శక్తిని పెంచటంలో గుడ్లు చాలా ఉపయోగపడతాయు. గుడ్లలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు , ప్రొటీన్‌ ఉంటాయి. వీటితో పాటు విటమిన్ ఏ, జింక్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. కాబట్టి డైలీ ఉడకపెట్టిన గుడ్డును ఒకటి తినటం మీ పిల్లలకు ఇప్పటినుంచే అలవాటు చేయండి.

baadam

5. బాదంలో విటమిన్లు, ఖనిజాలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి కంటికి ఎంతో మేలు చేస్తాయి. బాదంతో పాటు వాల్‌నట్స్, చియా గింజలు, నువ్వు గింజలు, వేరుశెనగలను తింటే కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిది. బాదం తింటే ఇంకా చాలా లాభాలు ఉన్నాయండోయ్..జుట్టు సమస్యలు, బరువు తగ్గటం వంటివి డైలీబాదం తినటం వల్ల తగ్గించుకోవచ్చు. అంతేకాదు బాదం తింటే ఏజ్ లుక్ కూడా కనిపించదట. స్కిన్ మృదువుగా అవుతుందంటారు.

6. పప్పుల్లో ప్రోటీన్‌లు బాగా ఉంటాయి. కిడ్నీ బీన్స్, బఠానీల్లో బయోఫ్లేవనాయిడ్స్, జింక్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే కంటి చూపు పెరుగుతుంది. ఇతర కంటి సమస్యలు కూడా తగ్గుతాయట.

vitamin c fruits

7. విటమిన్ సి..మనకు చాలా అవసరమైన విటమిన్.. నారింజ, బెర్రీలు, ద్రాక్షపండ్లు, నిమ్మకాయల్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు కంటి ఆరోగ్యానికి అవసరమైన ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందుకే ఈ పళ్లు తింటే కంటి చూపు పెరుగుతుంది. దాంతోపాటు రోగనిరోధక శక్తికూడా మెరుగుడుతుంది.

vitamin a foods

8. విటమిన్ ఏ కంటి చూపునకు ఎంతో మంచిది. క్యారెట్లలో విటమిన్-ఏ, బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే క్యారెట్లు బాగా తింటే కళ్లు బాగా కనిపిస్తాయి. క్యారెట్లు తింటే ఫేస్ లో కూడా మంచి గ్లోయింగ్ వస్తుంది.

ఇదండి..వీటిల్లో మీకు నచ్చినవి ఒకటి రెండు ఉంటే.. కనీసం మిగిలిన వాటిని అయినా మీ డైట్ లో భాగం చేసుకోండి. బోల్డంత ప్రపంచం ముందుంది మనం చూడటానికి.

 

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news