గుండె ఆరోగ్యం మనకు చాలా ముఖ్యం. మనిషికి ఉన్న అవయువాల్లో.. గుండె పాత్ర కీలకం. అయితే.. గుండె ఎలా అయితే పంపింగ్ చేస్తుందో..కాళ్ల పిక్కలు కూడా.. రక్తాన్ని పైకి పంప్ చేయటంలో దోహదం చేస్తాయి. పైగా గుండె నుంచి పంవ్ చేసే రక్తం భూమ్యాకర్షణ శక్తి వల్ల మన కాళ్లకు చేరడం ఒకింత సులభం. తిరిగి అక్కడి నుండి పైకి చేరటానికి పిక్కలే కీలకంగా పనిచేస్తాయి. ఈరోజు ఈ అంశం పై కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
కాళ్ల నుంచి గుండెకు రక్తం ప్రవహించాలంటే పై వైపునకు చేరాల్సి ఉంటుంది. అంటే భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో వెళ్లాలనమాట.. . అందుకు అవసరమైన శక్తిని సమకూర్చేది పిక్క మాత్రమే.. అందుకే ‘పిక్క’ను మన శరీరపు రెండో గుండెకాయగా చెప్తారు. మనిషికి ఒకటే గుండె ఉంటుందన్నది అందరికి తెలిసిందే… అయితే కాళ్ళ పిక్కలు కూడా గుండె నిర్వర్తించే విధులను నిర్వర్తిస్తాయని చాలా మందికి తెలిసి ఉండదు.
పిక్కబలంగా ఉంటే.. మన గుండె బలంగా ఉన్నట్లే.. గుండె తన పంపింగ్ ప్రక్రియ ద్వారా శరీరంలోని అన్ని భాగాలకూ రక్తాన్ని సరఫరా చేస్తుంది. అది శరీరంలో ఎగువన అనువైన ప్రదేశంలో ఉంది. కాబట్టి అన్నివైపులకూ రక్తాన్ని పంవ్ చేయడం సులభం. అయితే కాళ్లూ, పాదాలకు చేరిన రక్తం మళ్లీ గుండెకు చేరాలంటే భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా బలంగా పైకి రావాలి. రక్తంతోపాటు అదనపు బరువైన ఆక్సిజన్‌నూ, పోషకాలనూ తనతో మోసుకు వెళ్లాలి.. దీన్నే కాఫ్ మజిల్ పంవ్ అంటారు. అలాగే పెరిఫెరల్ హార్ట్ అని కూడా వైద్యభాషలో అంటారు.
పిక్కల్లోని ప్రధాన కండరాలైన గ్యాట్రోనమియస్, సోలెయస్ కండరాలు ఈ విధిని నిర్వహించడంలో కీలకంగా పనిచేస్తాయి. ఈ కండరాలు క్రమంగా ముడుచుకోవడం, తెరచుకోవడం ద్వారా రక్తనాళాల్లోని రక్తాన్ని పైకి వెళ్లేలా చేస్తాయి.
మన శరీరపు రెండో గుండె అయిన పిక్క సరిగా పనిచేయకపోతే అప్పటికే వినియోగితమైన రక్తం కాళ్లలోనే ఉండిపోతుంది. ఈ రక్తంలో ఆక్సిజన్ కండరాలు వినియోగించుకోవటం వల్ల మళ్లీ కండరాలకు తగినంత ఆక్సిజన్ ఉన్న రక్తం అందదు. దీంతో కండరాలు తీవ్రమైన అలసటకు గురవ్వాల్సి వస్తుంది. చాలా ఎక్కువ సేపు కదలకుండా కూర్చుని పనిచేసేవారికి , ఎక్కువసేపు అదేపనిగా నిలబడి ఉండేవారిలో, స్థూలకాయంతో బాధపడేవారికి, గర్భవతులుగా ఉన్న సమయంలో కొందరు మహిళలకు ఈ సమస్య రావచ్చు.
సమస్యను అధిగమించాలంటే క్రమం తప్పకుండా నడవడం మంచిది. రోజుకు 45 నిమిషాల చొప్పున వాకింగ్ చేయాలి. ఇలా వారంలో కనీసం ఐదురోజులైనా నడవడం వల్ల పిక్కతో పాటు శరీరంలోని అన్ని కండరాల్లో కదికలు ఏర్పడి ఆరోగ్యంగా ఉంటారు. శరీరపు బరువును అదుపులో ఉంచుకోవాలి. కాళ్లపై రక్తనాళాలు బయటకు కనిపిస్తుంటే వైద్యుని వద్దకు వెళ్ళి చికిత్స పొందటం మంచిది. వాకింగ్ చేయడం ఏంత ముఖ్యమో వైద్యులు చెప్తూనే ఉంటారు. ఇంట్లోనే ఉంటూ.. ఏటూ వెళ్లకుండా ఉండేవారు.. రోజు కనీసం గంటసేపునా వాకింగ్ చేయాల్సిందే.! లేదంటే భవిష్యత్తులో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందట.