విటమిన్ డి (Vitamin D) ఉండే ఆహారాలను తీసుకోవడం లేదా విటమిన్ డి సప్లిమెంట్లను వాడడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. కరోనా బారిన పడి చికిత్స పొందే బాధితులకు విటమిన్ డి సప్లిమెంట్లను కూడా ఇస్తుంటారు. అయితే శరీరంలో విటమిన్ డి స్థాయిలు అధికంగా ఉంటే కోవిడ్ నుంచి రక్షణ లభిస్తుందని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.
కెనడాకు చెందిన మెక్‌గిల్ యూనివర్సిటీ పరిశోధకులు గిలామె బట్లర్ లపోర్టె, టొమొకొ నకానిషిలు తాజాగా పరిశోధనలు చేపట్టారు. 4,134 మంది కెనడాకు చెందిన కోవిడ్ బాధితులతోపాటు ఇతర 11 దేశాలకు చెందిన 12,84,876 మందికి చెందిన ఆరోగ్య వివరాలను సేకరించారు. వారిలో విటమిన్ డి స్థాయిలు ఎక్కువగా ఉన్నవారిలో కోవిడ్ తీవ్రత తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అందువల్ల విటమిన్ డి స్థాయిలు ఎక్కువగా ఉంటే కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండవచ్చని చెబుతున్నారు.
సైంటిస్టులు చేపట్టిన సదరు అధ్యయనం తాలూకు వివరాలను పీఎల్‌వోఎస్ మెడిసిన్ అనే జర్నల్‌లోనూ ప్రచురించారు. అయితే విటమిన్ డి తక్కువగా ఉన్న సాధారణ వ్యక్తులకు ఆ సప్లిమెంట్లను ఇస్తే వారిలో కోవిడ్ ప్రభావం ఎలా ఉంటుంది ? అన్న విషయాలపై పరిశోధనలు చేయాల్సి ఉంటుందని, దీంతో విటమిన్ డికి, కోవిడ్‌కు మధ్య అసలు సంబంధం తెలుస్తుందని వారు అభిప్రాయ పడ్డారు.