రోజంతా హాయిగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి..

ప్రస్తుత పరిస్థితుల్లో అడుగు తీసి అడుగు వేయాలన్నా భయపడుతున్నారు. కరోనా రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నా ప్రస్తుతం పూర్తిగా మారిపోయాయి. కరోనా పాజిటివ్ భయాలతో చుట్టుపక్కలంతా నెగెటివిటీ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్ల ప్రశాంతంగా జీవించడం తెలుసుకోవాలి. అన్నింటినీ మెదడులో ఉంచుకుని ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చోవడం సరికాదు. ప్రస్తుత పరిస్థితుల్లో రోజంతా హాయిగా ఉండడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రొద్దున్న లేవగానే వ్యాయామం చేయడం మర్చిపోకండి. కనీసం 15నిమిషాల నుండి అరగంట పాటు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. దీనివల్ల కండరాలు ఉత్తేజం చెందుతాయి.

ఉదయం పూట పేపర్ చదివే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఐతే అలా అలవాటు ఉన్నవారు నెగెటివ్ వార్తలని చదవకపోవడమే మంచిది. పొద్దున్న మూడ్ బాగుంటే అదే రోజంతా కంటిన్యూ అవుతుంది. అందువల్ల మన మూడ్ పాడుచేసే నెగెటివ్ వార్తలని పొద్దు పొద్దున్న చదవకపోవడమే మంచిది. దానికి బదులు పాజిటివ్ కాలమ్స్ చదివితే మంచి ఎనర్జీ వస్తుంది.

లాక్డౌన్ వల్ల అందరూ సోషల్ మీడియాకి బాగా దగ్గరయ్యారు. కానీ దానివల్ల చాలా సమస్యలు తలెత్తుతాయి. సోషల్ మీడియాపై కూర్చునే టైమ్ తగ్గించుకుని కొత్త విషయాలు నేర్చుకోవడానికి రెడీ అవ్వండి. కొత్త వాటిపై జోష్ ఎక్కువగా ఉంటుంది. నేర్చుకుంటున్న కొద్దీ అది పెరుగుతుంది. అందుకే కొత్త వాటిని నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి.

ముఖ్య విషయం ఏమిటంటే, మీ చుట్టుపక్కల నెగెటివ్ గా ఆలోచించే వారు లేకుండా చూసుకోండి. మీరు కూడా మీ చుట్టుపక్కల వారికి సంతోషాన్ని పంచే విధంగానే ఉండాలి. మీ చుట్టుపక్కల కనిపించే సంతోషం మీలో ఆటోమేటిక్ గా సంతోషాన్ని తెస్తుంది.

సరైన టైమ్ లో భోజనం చేయడం, కనీసం ఆరు గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. ఇవన్నీ పెద్ద కష్టమైన విషయాలేమీ కావు. సో.. మీ జీవితాన్ని అందంగా మార్చుకోవాలనుకుంటే ఈ చిన్న వాటిని ప్రయత్నించండి.