చెన్నైలోని పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు తమ నీటిని తామే తెచ్చుకోవాలని ఆదేశించాయి. దీంతో వారు ఇంటి నుంచి తాగునీటిని ఆఫీసులకు తీసుకెళ్తున్నారు.
ఓ వైపు రుతు పవనాల రాకకు మరింత ఆలస్యం జరుగుతుండడంతో మరో వైపు జనాలకు వేసవి కష్టాలు తప్పడం లేదు. చాలా ప్రాంతాల్లో ఈ పాటికే వర్షాకాలం ప్రారంభం కావల్సి ఉన్నా.. రుతు పవనాలు నెమ్మదిగా కదులుతుండడంతో ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ క్రమంలోనే దేశంలోని అనేక ప్రాంతాల్లో జనాలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే చెన్నైలో మాత్రం ప్రజలకు నీటి సమస్య మరింత ఎక్కువైందనే చెప్పవచ్చు. ఇక అక్కడి ఐటీ కంపెనీలు అయితే తమ ఉద్యోగులకు తాగునీటిని కూడా అందించలేని స్థితిలో ఉన్నాయి. దీంతో చెన్నైలో ఇప్పుడు నీటి కోసం ఎంతటి కట కట నెలకొందో మనకు ఇట్టే అర్థమవుతుంది.
చెన్నైలోని పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు తమ నీటిని తామే తెచ్చుకోవాలని ఆదేశించాయి. దీంతో వారు ఇంటి నుంచి తాగునీటిని ఆఫీసులకు తీసుకెళ్తున్నారు. అలాగే ఇంటి నుంచే భోజనం, డిస్పోజబుల్ గ్లాస్‌లు, ప్లేట్లు తెచ్చుకోవాలని ఆయా కంపెనీలు ఉద్యోగులకు చెబుతున్నాయి. ఇక అక్కడి ఓ ప్రముఖ హోటల్ గ్రూప్ యాజమాన్యం నీటి సమస్య పరిష్కారమయ్యే వరకు వంట చేయడం నిలిపివేస్తున్నామని ప్రకటించింది. దీంతో చెన్నైలో నెలకొన్న నీటి సమస్యపై వెంటనే నివేదికను ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
చెన్నైలో ఉన్న దాదాపు 12 ఐటీ కంపెనీలు తమ కంపెనీల్లో పనిచేస్తున్న 5వేల మంది దాకా ఉద్యోగులకు నీటిని వారే తెచ్చుకోవాలని చెప్పాయి. అయితే ఇంటి నుంచి పనిచేసేట్లయితే ఉద్యోగులు ఇంట్లోనే ఉండి సేవలు అందించవచ్చని కొన్ని కంపెనీలు ఆఫర్ ఇస్తున్నాయి. దీంతో కొందరు ఆఫీసులకు వెళ్లకుండా ఇంటి నుంచే పనులు చేస్తున్నారు. అయితే మరో నెల వరకు దాదాపుగా ఇదే పరిస్థితి ఉండవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రుతు పవనాలు ఆలస్యంగా వస్తుండడంతో మరో నెల రోజుల్లో వర్షాలు పడి భూగర్భ నీటి నిల్వలు పెరిగితే అప్పుడు నీటి సమస్య తీరుతుందని వారు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా.. వర్షాలు పడేదాకా నీటి సమస్యలను మనం అనుభవించక తప్పదు..!