5జీ మొబైల్ హ్యాండ్‌సెట్‌లు కలిగిన వినియోగదారులు ఇప్పటి వరకూ 5G నెట్‌ను ఫ్రీగా వాడేసుకున్నారు. కానీ ఇక నుంచి అది కుదరదు..టెలికాం కంపెనీలు అందించే అపరిమిత సేవలు త్వరలో రద్దు కానున్నాయి. బదులుగా, ఒక నివేదిక ప్రకారం, 5G సేవలకు అదనపు రుసుము వసూలు చేయనున్నారు.
ప్రస్తుతం, Jio మరియు Airtel కంపెనీలు కూడా తమ వినియోగదారులకు 4G ధరలకు 5G సేవలను అందిస్తున్నాయి. అలాగే, డేటా వినియోగం కోసం రోజువారీ పరిమితి తీసివేయబడింది. కానీ భారత ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియోలు ఈ ఏడాది ద్వితీయార్థం నుండి 5-10 శాతం వరకు ధరలను పెంచాలని నిర్ణయించుకున్నాయి, ఆదాయాన్ని మరియు మూలధన సేకరణను పెంచడానికి. ఈ రెండు కంపెనీలు ఇప్పటికే పూర్తి స్థాయి 5జీ సేవలను అందిస్తున్నాయి. ఈ సంస్థలకు 12.5 కోట్ల మంది 5జీ వినియోగదారులు ఉన్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోని BSNL మరియు వోడాఫోన్ ఐడియా యాజమాన్యంలోని VI ఇప్పటికీ 5G సేవ యొక్క ప్రారంభ దశలోనే ఉన్నాయి.
5జీ ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలు ఎలా ఉంటాయి?
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం జియో, ఎయిర్‌టెల్ తమ 5జీ ప్లాన్‌లను 2024 ద్వితీయార్ధంలో అందుబాటులోకి తీసుకురావచ్చు. అంటే 2024 జులై నుంచి డిసెంబర్ మధ్య ఎప్పుడైనా ప్రారంభించవచ్చని టెలికాం పరిశ్రమలోని నిపుణుడు పేర్కొన్నారు. 5జీ ప్లాన్‌లను కొనుగోలు చేయడానికి వినియోగదారులు 10 శాతం ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు. 5జీ ప్లాన్‌లలో 4జీ ప్లాన్‌లతో పోలిస్తే 30% ఎక్కువ ఇంటర్నెట్ డేటా అందించనున్నారు. ప్రస్తుతం 4జీ ప్లాన్‌ల్లో రోజుకు 1.5 జీబీ నుంచి 3 జీబీ వరకు డేటా అందించే ప్లాన్లు ఉన్నాయి. అయితే 5జీ ప్లాన్‌ల్లో రోజుకు 2 జీబీ నుంచి 4 జీబీ వరకు డేటా ప్లాన్ ఇవ్వవచ్చు.ఇది కాకుండా 2024లో 5జీ ప్లాన్‌లను ప్రారంభించడంతో పాటు కంపెనీలు 4జీ ప్లాన్‌ల రేట్లను కూడా పెంచబోతున్నాయని సమాచారం. ఇప్పటి వరకూ జియో, ఎయిర్టెల్ యూజర్లు ఫ్రీగా 5G వాడుకుని తెగ ఎంజాయ్ చేశారు. ఇక పైసలు కట్టాల్సిందే మరీ..!