దేశంలో పెరుగుతున్న క్యూఆర్‌ కోడ్ స్కామ్‌.. బలువుతున్న యువత

-

టెక్నాలజీ ఎంత బాగా పెరిగిందో.. అంత బాగా సైబర్‌ మోసాలు కూడా పెరుగుతున్నాయి. కేవలం చదువుకోని వాళ్లు మాత్రమే కాదు చదువుకున్న వాళ్ల కూడా ఈ మోసాలకు బలవుతున్నారు. క్యూఆర్ కోడ్ స్కాం ఎలా జరుగుతుంది? సైబర్ నేరగాళ్లు ఏం చేస్తారు? వీటి నుంచి ఎలా తప్పించుకోవాలనే విషయాలు తెలుసుకుందాం.

బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్ ఇలాగే రూ.63 వేలు కోల్పోయాడు. ఓ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారంలో తన వాషింగ్ మెషీన్‌ అమ్మకానికి పెట్టాడు. యాడ్ చూసిన బయ్యర్ ప్రొఫెసర్‌కి ఫోన్ చేసి పేమెంట్ చేయడానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని కోరాడు. దీనిని నమ్మి కోడ్‌ స్కాన్ చేయగానే అకౌంట్‌లో ఉన్న రూ.63 వేలు కట్‌ అయ్యాయి. బెంగళూరుకు చెందిన మరో మహిళ తన ‘వీన’ను ఆన్‌లైన్ ప్లాట్‌ఫారంలో అమ్మకానికి పెట్టింది. ఓ బయ్యర్ ఫోన్ చేసి బ్యాంక్ అకౌంట్ వివరాలు పొందాడు. అనంతరం, ఓ లింక్‌ పంపించి దానిని క్లిక్ చేస్తే డబ్బులు జమవుతాయని నమ్మబలికాడు. తీరా క్లిక్ చేయగానే రూ.20 వేలు అకౌంట్ నుంచి డెబిట్ అయ్యాయి. ఇలాంటి ఘటనలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.

ఎలా చేస్తారంటే?

క్యూఆర్ కోడ్‌ మోసానికి పాల్పడే సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారంలను వేదికగా చేసుకుంటారు. ఇల్లు అద్దెకు తీసుకుంటామని నమ్మించడం, అమ్మకానికి పెట్టిన వస్తువులను కొనుగోలు చేస్తామని చెప్పడం వీరికి అలవాటు. మొదట నమ్మించి ఆ తర్వాత బాధితులను గందరగోళానికి గురి చేస్తారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పేమెంట్ త్వరగా పూర్తవుతుందని కంగారు పెట్టించి ఓటీపీ వంటి వ్యక్తిగత వివరాలు రాబడతారు. ఆ తర్వాత అకౌంట్‌లో ఉన్న డబ్బుల్ని కాజేస్తారు. ఎక్కడా అనుమానం రాకుండా పనిని పూర్తి చేస్తారు. కొందరు పేమెంట్ చేస్తానని నమ్మించి యూపీఐ ఐడీ వివరాలు తెలుసుకుంటారు. ఆ తర్వాత కాల్స్, మెసేజెస్‌లు పంపి ఒత్తిడి తీసుకొస్తారు. రిసీవర్లను అయోమయంలో పడేసి డబ్బులు లాక్కుంటారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

క్యూఆర్ కోడ్ విషయంలో జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకటి బలంగా గుర్తుపెట్టుకోవాలి.. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తున్నామంటే.. మనం డబ్బులు చెల్లించాలి అని అర్థం. మీరు డబ్బులు తీసుకోవాల్సిన సందర్భంలో.. ఎలాంటి క్యూఆర్ కోడ్‌ స్కాన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా కాకుండా, డబ్బులు ఇస్తాం.. క్యూఆర్ కోడ్ అడుగుతున్నాడంటే అనుమానించాల్సిందే.

ఓఎల్‌ఎక్స్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌‌ఫారంలలో క్యాష్ రూపంలో ట్రాన్సాక్షన్లు చేయడం బెటర్. డబ్బులు పంపించే సమయంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు వివరాలు సరిచూసుకోవాలి. రిసీవర్ పేరు, అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ వంటివి సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయాలి. ఒకవేళ స్టిక్కర్ కవర్ అనుమానాస్పదంగా కనిపిస్తే చేయకూడదు. ఓటీపీ వంటి క్రెడెన్షియల్ సమాచారాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version