టెక్నాలజీ రోజు రోజుకు పెరిగిపోతుంది.. ఒకప్పుడు మనుషులు చేసేపనిని ఇప్పుడు రోబోలు చేస్తున్నాయి.. ఈ రోగానికి వైద్యం లేదు అని లేకుండా దాదాపు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు వైద్య విధానం అందుబాటులోకి వచ్చింది. మానవ ప్రాణాన్ని కాపడటమే అంతిమ లక్ష్యంగా వైద్యరంగంలో అధునాతన చికిత్సలు అమల్లోకి వచ్చాయి. బిడ్డ పుట్టక ముందే ఆ బిడ్డ ఆరోగ్య లోపాలను కనిపెట్టే ఆధునిక పరిజ్ఞానమే కాదు, ఆ సమస్యను పరిష్కరించే శస్త్రచికిత్సలు కూడా అందుబాటులోకి వచ్చాయి. దిల్లోలో AIIMS వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు..తల్లి కడుపులో ఉన్న గర్భస్థ శిశువుకు గుండె ఆపరేషన్ చేశారు..ఆశ్చర్యంగా ఉంది కదూ..!
తల్లి కడుపులో ఉన్న బిడ్డ గుండె పరిమాణం ద్రాక్ష పండంత ఉందట…అంత చిన్న గుండెకు 90 సెకన్ల పాటూ అంటే ఒకటిన్నర నిమిషం పాటూ ఆపరేషన్ చేశారు. ఆ శస్త్ర చికిత్స విజయవంతమైంది. ప్రధాని మోడీ AIIMS వైద్యులను మెచ్చుకున్నారు. గతంలో మూడుసార్లు గర్భస్రావాలకు గురైన ఓ మహిళ 28 ఏళ్ల వయసులో మళ్లీ గర్భం ధరించింది. కానీ గర్భస్థ శిశువు గుండె ఆరోగ్యంగా లేదని వైద్యులు చెప్పారు. అయినా ఆమె ఆ బిడ్డ తనకు కావాలని చెప్పింది. బిడ్డ బతకాలంటే గుండెకు ఆపరేషన్ చేయాలని చెప్పడంతో తల్లి సరే అంది.
కార్డియాలజీ విభాగం, కార్డియాక్ అనస్థీషియా, గైనకాలజీ వైద్యులంతా కలిపి ఈ ఆపరేషన్ విజయవంతంగా చేశారు. వైద్యులు చెబుతున్న ప్రకారం.. శిశువు గుండెకు రక్త సరఫరా సరిగా జరగడం లేదు. దీనికి రక్తనాళాల్లో అడ్డంకి ఉంది.. అల్ట్రాసౌండ్ ప్రక్రియలో తల్లి పొట్ట నుంచే సూదిని నేరుగా శిశువు గుండెలోకి గుచ్చారు వైద్యులు. తరువాత బెలూన్ కాథెటర్‌ని ఉపయోగించి రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి అడ్డుపడిన వాల్వ్‌ను తెరిచారు. దీంతో రక్త ప్రసరణ సాధారణంగా జరుగుతోంది. శిశువు గుండె బాగా అభివృద్ధి చెందుతుందని తాము ఆశిస్తున్నట్టు వైద్యులు చెప్పారు.
ఈ ఆపరేషన్ చాలా వేగంగా చేయాలని, అందుకే తాము ఒకటిన్నర నిమిషంలో పని పూర్తి చేసినట్టు చెప్పారు. గర్భస్థ శిశువు, తల్లి ఇద్దరి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. ఇంతకుముందు.. గర్భస్థ శిశువుకు ఇలాంటి గుండె సమస్యలు వస్తే.. అబార్షన్ చేయించుకోమని చెప్పేవాళ్లు.. కానీ ఇప్పుడు వైద్యరంగం అభివృద్ధి చెందడంతో బిడ్డ ప్రాణాన్ని కాపాడుతున్నారు..