మామిడి పండ్లలో అనేక రకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఒక్కో వెరైటీ భిన్నమైన రుచిని కలిగి ఉంటుంది. అన్ని రకాల వెరైటీలను తినడం చాలా కష్టమే. వాటిని వెదికేందుకే చాలా సమయం పడుతుంది. కానీ మీకు తెలుసా ? ఆ ప్రాంతానికి వెళితే ఏకంగా 121 వెరైటీలకు చెందిన మామిడి కాయలను ఒకే దగ్గర తినవచ్చు. అవును.. అవన్నీ ఒకే చెట్టుకు కాయడం విశేషం.
ఉత్తరప్రదేశ్ లోని సహారాన్‌పూర్ జిల్లాలో ఉన్న కంపెనీ బాగ్ అనే ప్రాంతంలో ఒక తోటలో ఒక చెట్టుకు ఏకంగా 121 వెరైటీల మామిడి కాయలు కాశాయి. 5 ఏళ్ల కిందట అక్కడి హార్టికల్చర్ విభాగం అధికారి రాజేష్ ప్రసాద్ ఆ చెట్టుపై ప్రయోగం చేశారు. ఆ చెట్టుకు ఉన్న కొమ్మలకు భిన్న రకాల వెరైటీలకు చెందిన మామిడి కొమ్మలను అంటు పెట్టారు. దీంతో ఆ చెట్టు బాగా పెరిగింది. ప్రయోగం విజయవంతం అయింది. ఇప్పుడు ఆ చెట్టుకు అంటు పెట్టిన కొమ్మలకు ఆయా వెరైటీలకు చెందిన మామిడి కాయలు కాశాయి. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ అయింది.
ఒకే చెట్టుకు భిన్న రకాల మామిడి వెరైటీ కాయలు కాయడం అంటే చాలా మంది నమ్మలేకపోతున్నారు. కానీ ఇది నిజం. ఇలా చేయడం వల్ల కొత్త రకాలకు చెందిన మామిడి కాయలు వస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ విధంగా ఎవరైనా సరే అంటు పెట్టి ప్రయోగాలు చేయవచ్చని అంటున్నారు. మరి మీక్కూడా ఈ విధంగా చేయాలనిపిస్తే ఇంకెందుకాలస్యం.. వెంటనే వెరైటీ మామిడి కొమ్మలను తెచ్చి మామిడి చెట్టుకు అంటు పెట్టేయండి. ప్రయోగం సక్సెస్ అయితే ఒకే చెట్టుకు భిన్న రకాల మామిడి కాయలను పండించవచ్చు.
అన్నట్లు ఇంకో విషయం.. ఆ చెట్టుకు కాసిన మామిడి కాయల్లో దశహరి, ఆమ్రపాలి, ఆలంపూర్ బెనిశా వంటి అనేక రకాల కాయలు ఉన్నాయి.