కరోనా నేపథ్యంలో గత ఏడాదిన్నర కాలంగా పిల్లలు స్కూళ్లకు దూరంగా ఉన్నారు. అయితే కోవిడ్ ఎట్టకేలకు తగ్గుతున్నందు వల్ల వచ్చే నెలలో పిల్లలను స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి చాలా వరకు రాష్ట్రాల్లో స్కూళ్లను మళ్లీ ఓపెన్ చేయనుండగా వచ్చే నెలలో మరిన్ని రాష్ట్రాల్లో పాఠశాలలను ప్రారంభించనున్నారు.
అయితే ఓ సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం 53 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తేలింది. 44 శాతం మంది మాత్రమే అందుకు విముఖతను వ్యక్తం చేశారు. జూన్ లో ఇదే సర్వే చేయగా అప్పుడు 76 శాతం మంది విముఖతను ప్రదర్శించారు. జూలైలో వారి శాతం 48 కి తగ్గింది. ఇప్పుడది 44కు చేరుకుంది.
కోవిడ్ రెండో వేవ్ కేసులు చాలా తక్కువగా నమోదు అవుతున్నందునే తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపేందుకు సుముఖంగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలోనే ఈ నెల 23వ తేదీ నుంచి యూపీ, గుజరాత్, ఒడిశా మహారాష్ట్రలలో స్కూళ్లు ప్రారంభం కానున్నాయి.
ఇక స్కూళ్లలో ర్యాపిడ్ యాంటీ జెన్ కిట్‌ను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందా ? అని ప్రశ్నించగా అందుకు 74 శాతం మంది అవును అని సమాధానం ఇవ్వడం విశేషం. అలాగే స్కూళ్లలో వ్యాక్సినేషన్ క్యాంపులను నిర్వహించాలా ? అని అడగ్గా.. అందుకు ఏకంగా 89 శాతం మంది అవును.. అని చెప్పడం విశేషం.