రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రి లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో అగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం విచారణ కమిటీని వేసింది. దీంతో ఇవాళ ఇబ్రహీంపట్నం ప్రభుత్వ వైద్యశాలను పరిశీలించింది పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ నేతృత్వంలోని ఐదుగురు నిపుణులతో కూడిన బృందం. ఈ సందర్భంగా హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కు.ని ఆపరేషన్లు వికటించిన కేసులో ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని.. 30 మంది మహిళలను హైదరాబాద్ కు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు.
ఈరోజు 11 మందిని డిశ్చార్జ్ చేస్తున్నామన్నారు శ్రీనివాసరావు. చికిత్స పొందుతున్న మరో 18 మందిని రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు. బాధిత మహిళల ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఆపరేషన్స్ చేసిన వైద్య సిబ్బందిని విచారణ చేశామన్నారు. వసతులు, ఆపరేషన్ థియేటర్ పని తీరుని పరిశీలించామన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు12 లక్షలకు పైగా ఆపరేషన్స్ నిర్వహించామన్నారు. 30 నుంచి 60 ఆపరేషన్స్ ప్రతీ క్యాంపుల్లో జరుగుతాయని తెలిపారు.
ఈ ఆపరేషన్స్ చేసిన డాక్టర్ వెంటనే మరో క్యాంపులో ఆపరేషన్స్ చేశారు.. వాళ్ళు క్షేమంగా ఉన్నారని తెలిపారు. 2,3 నిమిషాల్లో కు.ని ఆపరేషన్ జరుగుతుందని.. ఆపరేషన్స్ ఉపయోగించిన పరికరాలు, ఇతర వస్తువులను పరిశీలించినట్లు తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్టు రావాల్సి ఉంది. రిపోర్టు వచ్చిన తర్వాత భాద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆపరేషన్స్ జరిగిన తర్వాత అందరి పరిస్థితి బాగానే ఉందన్నారు. ఫుడ్ పాయిజన్ జరిగి కూడా ఉండొచ్చు.. ఆ కోణంలో కూడా విచారణ జరుపుతున్నామన్నారు.