వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదు – కిషన్ రెడ్డి

-

నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం సంభవించడంతో జనాల్లో భయాందోళన నెలకొందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ లోనే వరుస ప్రమాదాలు జరగడం, ప్రాణ నష్టం జరగడం దురదృష్టకరం అన్నారు. ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా అగ్ని ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు కిషన్ రెడ్డి.

తాను చాలాసార్లు అగ్ని ప్రమాద ఘటనలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానని.. సీఎం కి లెటర్ కూడా రాశానన్నారు. ఇప్పటికైనా గోదాం లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనావాసాల మధ్య గోదాంలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల్లో విద్యుత్ శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్ సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. జిహెచ్ఎంసి రెగ్యులర్ మానిటరింగ్ చేయాలి కానీ.. ఆదాయం వేట లోనే ఉంటుందని ఆరోపించారు.

ఆదాయం కోసం ఇల్లీగల్ నిర్మాణాలను ప్రోత్సహిస్తోందన్నారు. Q net లాంటి సంస్థల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి సంస్థల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. తూతూమంత్రంగా కమిటీలు వేసి, నష్ట పరిహారం ఇచ్చి చేతులు దులుపుకునే పద్ధతి మానుకోవాలని హితవు పలికారు కిషన్ రెడ్డి. స్వప్న లోక్ ఘటనలో చనిపోయిన వారికి కేంద్రం తరఫున కూడా నష్ట పరిహారం చెల్లించాలని ప్రధాన మంత్రిని కోరానన్నారు. ఒక్కొక్కరికి 2 లక్షలు చెల్లించేలా ఒప్పుకున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version