ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును సంప్రదించింది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. గోయల్ నియామకం ఏకపక్షంగా జరిగిందని, ఎన్నికల సంఘం సంస్థాగత సమగ్రతను, స్వతంత్రతను ఉల్లంఘించిందని ఎన్‌జీవో తెలిపింది. ఎన్నికల సంఘం సభ్యులను నియమించేందుకు తటస్థ లేదంటే స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తమ స్వలాభం కోసం పక్కా ప్రణాళికతో ఎంపిక ప్రక్రియలో భాగమయ్యాయని పిటిషన్‌లో ఆరోపించింది.
19 నవంబర్, 2022 నాటి నోటిఫికేషన్ ప్రకారం.. అరుణ్ గోయల్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించడాన్ని సవాల్ చేస్తూ ప్రజా ప్రయోజనాల కింద రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు ఏడీఆర్ తెలిపింది. ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ సిఫారసు మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్‌లను రాష్ట్రపతి నియమిస్తారని మార్చి 2న తన తీర్పులో అత్యున్నత న్యాయస్థానం పేర్కొనడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలన్న సర్వోన్నత న్యాయస్థానం.. అలా జరుగకుంటే వినాశకర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించింది. ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధంగా పనిచేయాలని ధర్మాసనం, కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు , ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకాలకు కొలీజియం తరహా వ్యవస్థ ఉండాలని పలు పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు తెలియపరిచింది.