రాష్ట్రంలో కొత్తగా 60 పోస్టులను కలిపి 563 గ్రూప్-1 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.గ్రూప్-1 దరఖాస్తులలో దొర్లిన తప్పుల సవరణకు అవకాశం కల్పించింది. శనివారం (రేపు ) ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎడిట్ ఆప్షన్ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ శుక్రవారం ప్రకటించారు. గ్రూప్-1 ఉద్యోగాల కోసం చేసుకున్న దరఖాస్తుల్లో పేరు, పుట్టిన తేదీ, జెండర్, విద్యార్హతలు, ఫొటో, సంతకం వంటి వాటిలో ఏమైనా తప్పులు ఉన్నట్లు గుర్తిస్తే వాటిని సరి చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇక దరఖాస్తుల గడువు ముగిసేసరికి 4.03 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ క్రమంలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9వ తేదీన, మెయిన్స్ పరీక్షను అక్టోబర్ 21వ తేదీన నిర్వహించనున్నారు.
కాగా…..2022 ఏప్రిల్ లో 503 పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసిన సంగతి తెలిసిందే.అయితే పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా పడితే.. మరొకసారి నిబంధనలు సరిగ్గా పాటించలేదని రెండోసారి కూడా ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేశారు.కొత్త అభ్యర్థులతో పాటు గత నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్నవారు కూడా మళ్లీ అప్లై చేసుకోవాల్సి ఉంటుందని TSPSC పేర్కొంది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఫీజు నుంచి మినహాయింపు కల్పించింది.