మునుగోడులో గెలుపే లక్ష్యంగా భాజపా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టిన కాషాయదళం విజయఢంకా మోగించడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఇందులోభాగంగానే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో అమిత్ షా మునుగోడు పర్యటన షెడ్యూల్ ఖారారైంది.
- ఈనెల 21న మునుగోడులో భారీ బహిరంగ సభ
- ఆగస్టు 21న మధ్యాహ్నం 3.30 గంటలకు అమిత్ షా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
- అనంతరం అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం నాలుగున్నర గంటలకు మునుగోడుకు చేరుకుంటారు.
- సాయంత్రం 5గంటలకు మునుగోడులో జరిగే భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. ఇదే సభలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని భాజపాలోకి ఆహ్వానించనున్నారు.
- అదే రోజు సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక హెలీకాప్టర్‌లో బేగంపేట ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతారు.
అమిత్ షా మునుగోడు పర్యటన నేపథ్యంలో సీఆర్పీఎఫ్ అధికారులు రాష్ట్ర పోలీస్ అధికారులతో భద్రతపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. అమిత్‌షా వస్తుండటంతో.. సభకు పెద్దఎత్తున జనాన్ని తీసుకొచ్చేందుకు నేతలు శ్రమిస్తున్నారు. ఇప్పటికే జన సమీకరణ, ఇతర ఏర్పాట్ల కోసం పార్టీ రాష్ట్ర నాయకత్వం.. మండలానికి ఇద్దరు చొప్పున ఇంఛార్జ్‌లను నియమించింది. ఈ నేతలు శ్రేణులను సమన్వయం చేసుకుంటూ.. బహిరంగ సభకు భారీ ఎత్తున తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.