కుప్పకూలిన అందవెల్లి బ్రిడ్జి.. 52 గ్రామాల మధ్య రాకపోకలు బంద్

-

కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని అందవెల్లి సమీపంలో పెద్ద వాగుపై ఉన్న వంతెన కుప్పకూలింది. రెండు నెలల కిందట భారీ వర్షాలు, వరదలతో బ్రిడ్జిలోని ఓ పిల్లరు కుంగి పోయిన సంగతి తెలిసిందే. దీంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ఆ తర్వాత మరింతగా కుంగిన వంతెన అర్ధరాత్రి కుప్పకూలింది. బ్రిడ్జికి సంబంధించిన రెండు పిల్లర్లు, మూడు స్లాబులు నేలమట్టం అయ్యాయి. బ్రిడ్జి రాత్రికి రాత్రి కుప్పకూలిపోవడంతో మూడు మండలాల్లో 52 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాలనుకున్నవారు.. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ప్రమాదకరంగా తెప్పలపై ప్రయాణం సాగిస్తున్నారు. కొద్ది రోజుల కిందట విద్యార్థులతో వెళ్తున్న తెప్ప  బోల్తా కూడా పడింది.

బ్రిడ్జ్ దెబ్బతినడం పట్ల స్థానిక విపక్ష నాయకులు విమర్శించారు. ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం పట్ల మండిపడుతున్నారు. వెంటనే బ్రిడ్జ్ పిల్లర్ కు మరమత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు. బ్రిడ్జ్ పై రహదారికి అడ్డంగా గోడలు కట్టి రాకపోకలు నిలిపివేశామని తహశీల్దార్ ప్రమోద్ కుమార్ తెలిపారు. వంతెన పిల్లర్ కుంగిపోయి ప్రమాదకరంగా ఉన్నందున రహదారిని మూసివేశామని ప్రజలు సహకరించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version