నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో టీడీపీ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ కి అభివృద్ధి చేయడం చేతకాదని.. రాష్ట్రాన్ని అథోగతి పాలు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. విద్యుత్ ఛార్జీల పెంచనని చెప్పి ప్రజలపై భారం వేశారని విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగాయన్నారు. మద్యం ధరలు పెంచి నాసిరకం మద్యాన్ని సరఫరా చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
జగన్ చెప్పే మద్యపాన నిషేధాన్ని మీరు నమ్ముతారా అంటూ ప్రశ్నించారు. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పారని.. ఇప్పుడు చేశారా.. మీరే ఆలోచించాలన్నారు. మద్యంపై వచ్చే ఆదాయంతో రూ.16 వేల కోట్ల మీద అప్పులను తీసుకువచ్చారని ఆరోపణలు చేశారు. వింజమూరులో కూడా గంజాయి దొరుకుతోందన్నారు. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేరు కానీ గంజాయిని మాత్రం సరఫరా చేస్తారని విమర్శించారు. విశాఖపట్నం పోర్టు ద్వారా 25 వేల కిలోల డ్రగ్స్ దిగుమతి అయ్యాయని.. డబ్బుల కోసం గంజాయి.. డ్రగ్స్ దిగుమతి చేసుకున్నారని ఆరోపించారు. జగన్ వల్ల యువత భవితవ్యం నిర్వీర్యమవుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు
ఒకటో తారీఖున జీతాలు రావడం లేదన్నారు.