ఒంగోలులో ఓటర్లకు పంచేందుకు తీసుకెళ్తున్న 5 లారీల బియ్యం సీజ్

-

దేశవ్యాప్తంగా రేపు (మే 13వ తేదీ 2024) లోక్సభ నాలుగో విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సజావుగా జరిగేలా భారీగా బందోబస్తు కూడా నిర్వహించారు. మరోవైపు ఈ పోలింగ్ ప్రక్రియలో ఓటర్లను రాజకీయ నేతలు ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎన్నికల్లో మద్యం, నగదు పంపిణీ జరగకుండా ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒంగోలు నగరంలోని వేంకటేశ్వర కాలనీలో భారీగా బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ 5 లారీల బియ్యం బస్తాలను సీజ్ చేశారు. ఓటర్లకు పంచేందుకు వీటిని తీసుకొచ్చినట్లు గుర్తించారు. మద్దిపాడు మండలం గ్రోత్‌ సెంటర్‌లోని రైసు మిల్లు నుంచి వచ్చినట్లు తెలిపారు. అనంతరం రైస్‌ మిల్లులోనూ రవాణాకు సిద్ధంగా ఉన్న మరో లారీ బియ్యాన్ని సీజ్‌ చేసిన అధికారులు.. అధికార పార్టీకి చెందిన నాయకుల ఆధ్వర్యంలో ఈ బియ్యం పంపిణీకి యత్నిస్తున్నట్లు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version