ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యాశాఖ వెల్లడించింది. అక్టోబర్ 3 నుంచి 21 వరకు ఏపీలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ఇప్పటికే ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. దసరా పండుగ నేపథ్యంలో అక్టోబర్ 11, 12 తేదీల్లో మినహా మిగతా తేదీల్లో టెట్ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. టెట్ పరీక్షకు 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది.
సెప్టెంబర్ 22 నుంచి టెట్ అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేయనున్నట్లు సమాచారం. అయితే, టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎగ్జామ్ సెంటర్లు కేటాయించడం గందరగోళానికి గురి చేయగా.. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్న అభ్యర్థులకు ఒకే ప్రాంతంలో పరీక్ష సెంటర్‌ను కేటాయిస్తూ ఆన్‌లైన్‌లో హాల్ టిక్కెట్లను అందుబాటులో ఉంచారు.