తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును వాడారని సీఎం చంద్రబాబు వెల్లడించిన నాటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో ఆందోళన మొదలైంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ ఆలయాల్లో ప్రసాదాల తయారీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం ప్రసాదం నాణ్యతపై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ అన్నవరం ప్రసాదం తయారీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రసాదం నాణ్యతపై అభియోగాలు వచ్చినందునే తాను ప్రసాదం తయారీ కేంద్రంలో తనిఖీలు చేపట్టామని తెలిపారు. ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్ను మార్చాల్సి ఉండగా.. గత రెండేళ్లుగా ఓకే వ్యక్తికి టెండర్ ఇలా ఇచ్చారని ప్రశ్నించారు. అనంతరం అక్కడున్న రికార్డులను ఆమె పరిశీలించారు. ప్రసాదంలో వాడే పదార్థాల శాంపిల్స్ ను అధికారులు సేకరించారని, త్వరలోనే సమగ్ర విచారణ జరిపిస్తామని సత్యప్రభ పేర్కొన్నారు.