ఏపీలో కేంద్ర ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో జాప్యం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 56 ప్రాజెక్ట్‌లకు సంబంధించి అంచనా వ్యయం 52.36 శాతం…అంటే అదనంగా 53 వేల కోట్ల రూపాయలు పెరిగినట్లు గణాంకాలు, కేంద్ర కార్యక్రమాల అమలు శాఖ సహాయ మంత్రి శ్రీ రావ్ ఇందర్‌జిత్ సింగ్ వెల్లడించారు.
ఏపీలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్‌లు నిర్ణీత గడువులోగా పూర్తి కానందున ఆయా ప్రాజెక్ట్‌ల వాస్తవ అంచనా వ్యయం 40 శాతం పెరిగిన విషయం వాస్తవమేనా? వాస్తవమైతే ఆయా ప్రాజెక్ట్‌ల వివరాలు, పెరిగిన వాటి అంచనా వ్యయం మొత్తం ఎంతో తెలియచేయండి అంటూ రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం తెలిపారు.
ప్రాజెక్ట్‌లను అమలు చేసే కేంద్ర సంస్థలు ఆన్‌లైన్ కంప్యూటరైజ్డ్ మానిటరింగ్ వ్యవస్థ (ఓసిఎంఎస్)లో ఆయా ప్రాజెక్ట్‌ల నిర్మాణ పురోగతిని తెలిపే వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తుంటాయని మంత్రి చెప్పారు. 2023 ఫిబ్రవరి నాటికి అందిన ఫ్లాష్ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 1,01,272 కోట్ల రూపాయల వాస్తవ అంచనా విలువతో ప్రారంభించిన 56 ప్రాజెక్ట్ పనుల అంచనా విలువ 1,54,300 కోట్ల రూపాయలకు పెరిగినట్లు మంత్రి పేర్కొన్నారు.