తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కొన్ని సామీప్యతలు కనిపిస్తున్నాయి.ఓ వైపు కేసీఆర్ మరోవైపు చంద్రబాబు కూడా మోడీనే వ్యతిరేకిస్తున్నారు.రేపటి వేళ అదృష్టం బాగుంటే చంద్రబాబుతో బీజేపీ స్నేహం చేయొచ్చునేమో కానీ అందాక మాత్రం ఒంటరి పోరాటం తెలుగు దేశం పార్టీ చేయాల్సిందే! నాయకులు ఉన్నా కూడా పెద్దగా పోరాట పటిమలో అయితే లేదు.ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారంతా ఇప్పుడు ఇంటికే పరిమితం అయి అప్పుడప్పుడూ ప్రజల ముందుకు మరియు మీడియా ముందుకు వస్తున్నారు.దీంతో మోడీని వ్యతిరేకించే మాటేమో కానీ కనీసం తెలుగుదేశం ఉనికి ఆంధ్రాలో కొనసాగడం కూడా కష్టంగానే ఉంది.దీంతో త్వరలో కేసీఆర్ తో చంద్రబాబు కలిసి పనిచేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
మరోవైపు కేసీఆర్ కూడా తన రాజకీయ గురువును కలుపుకుని పోయేందుకు సిద్ధం అవుతున్నారు.గతంలో కూడా ఆయనతో కలిసి మహా కూటమి ఒకటి ఏర్పాటు చేసి వైఎస్సార్ కు వ్యతిరేకంగా పనిచేసిన దాఖలాలు ఉన్నాయి.ఆ రోజు కేసీఆర్ పెద్దగా లాభ పడకపోయినా కాస్తో కూస్తో యాంటీ గవర్నమెంట్ వాయిస్ ను మాత్రం ప్రొజెక్ట్ చేయగలిగారు.తాజా పరిణామాల నేపథ్యంలో మోడీని సమర్థంగా ఎదుర్కొనేందుకు మహారాష్ట్ర పెద్దలతో భేటీ అయిన విషయం తెలిసిందే! త్వరలో కర్ణాటక మరియు తమిళనాడు పెద్దలతోనే కేసీఆర్ భేటీ అయి రానున్న కాలంలో ఏం చేయాలో, ఏ విధంగా పనిచేసి మోడీని గద్దె దింపాలో అన్న విషయమై కేసీఆర్ ఒకటికి రెండు సార్లు ఆలోచించి సంబంధిత విషయ నిపుణులతో చర్చించి తరువాత కార్యాచరణను ప్రకటించేందుకు సమాయత్తం అవుతున్నారు.
ఎలానూ జగన్ తన మిత్రపక్షంగానే బీజేపీని చూస్తున్నారు కనుక ఆయనతో కన్నా చంద్రబాబుతో వెళ్లేందుకు ఇష్టపడుతున్నా రు.మరోవైపు కమ్యూనిస్టు పార్టీలతోనూ సంబంధిత విప్లవ శక్తులతోనూ కూడా పనిచేసేందుకు కేరళ సీఎం పినరయి విజయన్ తో కలిసి పోరాడేందుకు కేసీఆర్ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ బంధాలను మరింత సుదృఢం చేసుకోనున్నారు.ఈ దశలో చంద్రబాబుతో పనిచేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఒకటి చేస్తున్నారన్నది తెలుస్తోంది.ఇవన్నీఇలా ఉంటుండగానే కాంగ్రెస్ సాయం లేకుండా బీజేపీతో ఫైట్ చేయడం అనవసరం అని కొందరు తేల్చేస్తున్నారు. కేజ్రీవాల్ లాంటి నేతలు, మమతా బెనర్జీ లాంటి నేతలు ఎందరున్నా కూడా కాంగ్రెస్ లేకుండా కూటమి ఏర్పాటు తరువాత పోరాటం తరువాత ఫలితం ఇలా ఏవీ కూడా కేసీఆర్ కు అనుకూలంగా ఉండే పరిణామాలు కానేకావని కూడా కొందరు రాజకీయ పరిశీలకులు తేల్చేస్తున్నారు.కనుక దేశం యావత్తూ నెలకొన్న మోడీ హవాను ఎదుర్కోవాలంటే దళిత, మైనార్టీ వర్గాలను ఏకం చేయడమే కాదు వారి ఓటింగ్ ను తమకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది.ఇదే సమయంలో చంద్రబాబు లాంటి రాజకీయ చతురత మరియు చాణక్యత ఉన్న నేతలతో పనిచేయడం కూడా అత్యావశ్యకమే!