ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళను తాకాయి. ఆ తర్వాత కర్ణాటకలోనూ విస్తరించాయి. ఇక ఆదివారం రోజున నైరుతి.. ఏపీని తాకింది. దీంతో తెలంగాణలోనూ వాతావరణంలో కొంతమేర మార్పులు షురూ అయ్యాయి. కొద్ది రోజులుగా 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకున్నాయి. రేపు, ఎల్లుండి తెలంగాణను తొలకరి పలకరించే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ వర్గాలు అంచనా వేశాయి. ఇప్పటికైతే పశ్చిమ దిక్కు నుంచి గాలులు వస్తున్నాయని, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిసరాల్లో వాతావరణంలో మార్పులను అంచనా వేసిన అనంతరం ఒక నిర్ణయానికి రానున్నట్లు తెలిపాయి.
రాష్ట్రంలోని 10 జిల్లాల్లోని 27 మండలాల్లో ఆదివారం రోజున వడగాలులు వీచాయి. పెద్దపల్లి జిల్లా ముత్తారంలో తీవ్రత ఎక్కువగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, ఖమ్మం, కుమురంభీం ఆసిఫాబాద్, ములుగు, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లోనూ వడగాలుల ప్రభావం ఉంది. సోమ, మంగళవారాల్లో కూడా రాష్ట్రంలోని కొన్నిచోట్ల వడగాలులు వీచే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.