రాముడయినా కృష్ణుడయినా మన తారక రాముడే వేయాలి. మన నందమూరి నాయకుడే ఒదిగిపోవాలి. రావణుడు, దుర్యోధనుడు ఎవ్వరయినా మన ఎన్టీవోడే నటించాలి.మెప్పించాలి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి జీవితం ఈ విధంగా మలుపు తిరగడం దైవేచ్ఛ! అని అన్నారట ఆయన! అవును! ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఆ దైవ కృప లేనిదే తెలుగు వారికి రాముడు రూపం ఇంత అపురూపం కాదేమో! ఇంతటి ప్రజ్ఞా రూపం మరో చోట ఉండదేమో! జేజేలు ఎన్టీఆర్ కు.. జేజేలు తారక రామునికి!
ఎన్టీఆర్ నుంచి ఎన్టీఆర్ వరకూ నేర్చుకోవాల్సినవి,నెరవేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఆయన క్రమశిక్షణ ఎవ్వరికీ రాదు. ఆయన వ్యక్తిత్వంలో పోటీనే లేదు. అంతేకాదు నిర్మాతల పాలిట ఆయన ఓ వరం. నిండు చందురుడు అంటే ఆయనే!అమవాసే లేని నిండు చందురుడు అంటే ఆయనే!
ఏ సినిమా చేసినా ఏ పాత్ర ఎంచుకున్నా అందులో లీనమయిపోవడం ఆయనకు మాత్రమే సాధ్యం అయిన రీతి.జీవిత చరమాంకంలోనూ ఆయన ఎంతో నిబద్ధతగానే ఉంటూ ఆరోగ్యం విషయమై జాగ్రత్తలు తీసుకుంటూ గడిపారు. కొన్నిరాజకీయ కారణాల రీత్యా ఆయన కీర్తి మసకబారవచ్చునేమో కానీ నటుడిగా ఆయన ఖ్యాతి అజరామరం.
ఎన్టీఆర్ తో నటించిన వారెవ్వరయినా చెప్పే మాట ఒక్కటే క్రమశిక్షణ విషయంలో ఆయన రాజీ పడరు అని! ప్రొడ్యూసర్ తనకు తల్లి లాంటి వారు అని అంటారని! ఆయన పెట్టిన ముద్ద కారణంగానే తానీ స్థితిలో ఉన్నానని! అదేవిధంగా డైరెక్టర్ ఏం చెబితే అది చేసేందుకు సిద్ధంగా ఉంటే నటుడని! ఇవన్నీ మన తారక రాముడి లక్షణాలు.. ఇవే సుగుణాలు నేటి తారక్ లో కూడా ఉన్నాయని అంటారు.
తాతగారిలానే పాత్ర కు అనుగుణంగా తనని తాను మలుచుకునే తీరు, సంభాషణలు పలికే రీతి ఇవన్నీ ఆ పెద్దాయన నుంచే అలవడ్డాయన్నది అభిమానుల మాట. తెలుగు జాతి ఉన్నంత వరకూ మీ కీర్తి అజరామరం అని చెప్పడం అలవాటులో ఉన్న మాట కాదు అలవాటు తప్పని మాట కూడా ఇదే రామన్నా!