తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా సోమవారం కేంద్రం వంద రూపాయల స్మారక నాణాన్ని ఆవిష్కరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణాన్ని విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్ సంస్కృతిక కేంద్రంలో ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా, టిడిపి అధినేత నారా చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ, ప్రముఖులు హాజరయ్యారు.
ఎన్టీఆర్ స్మారక నాణాన్ని ఆవిష్కరించడం తెలుగుజాతికి దక్కిన గౌరవమని అన్నారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఓ తెలుగువాడిగా, నందమూరి తారకరామారావు మనవడిగా గర్విస్తున్నానని అన్నారు. ఎన్టీఆర్ కథానాయకుడు, ప్రజా సేవకుడు, తెలుగుజాతిని ఒక్కతాటిపై నడిపించిన మహా నాయకుడు అని అన్నారు. ఆయన కోట్లాదిమంది హృదయాలలో దేవుడై కొలువున్నారని.. ఆయనే మనందరికీ స్ఫూర్తి అని కొనియాడారు.