ఎన్నికల పొత్తులో భాగంగా 50 స్థానాలను కోరుకుంటున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏమైనా సాక్షి దినపత్రిక చెవిలో చెప్పారా? అని రఘురామకృష్ణ రాజు ప్రశ్నించారు. సీట్ల కేటాయింపులో టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం చేస్తారేమోనని సాక్షి దినపత్రిక ప్రచురించిన వార్తా కథనం చూస్తే విడ్డూరంగా ఉందని, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారిపై అసత్య కథనాలను రాస్తూ, పొద్దున లేస్తే మొదలు ఆయనను దూషించే సాక్షి దినపత్రికకు టీడీపీ – జనసేన కూటమి సీట్ల సర్దుబాటు గురించి ఏమీ అవసరమని ఆయన నిలదీశారు.
సీట్ల సర్దుబాటు గురించి ఎక్కువ సమయం తీసుకుంటున్నారని సాక్షి దినపత్రిక తన వార్తా కథనంలో పేర్కొనడంపై రఘురామకృష్ణ రాజు గారు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ – జనసేన కూటమి తమ సీట్ల సర్దుబాటును వారు ఎప్పుడు కావాలని అనుకుంటే అప్పుడు చేసుకుంటారని దాని వలన సాక్షి దినపత్రికకు వచ్చిన నష్టం ఏమిటి? అని ప్రశ్నించారు. ముందు మీ ఇంటిని చక్కదిద్దుకోండని ఎద్దేవా చేశారు. ఎంపీ టికెట్ కోసం 140 కోట్ల రూపాయలను వైకాపా నాయకత్వం అడిగిందని ఇన్ డైరెక్టుగా చేసిన వ్యాఖ్యలపై సాక్షి దినపత్రిక సమాధానం చెప్పాలని అన్నారు.
నరసాపురం నియోజకవర్గంలో తనపై పోటీ చేయమని ఏ రాజుతో.. ఏ కాపు నాయకునితో మాట్లాడారో తనకు తెలుసునని, తనపై పోటీ చేయించేందుకు అభ్యర్థులు దొరకక దేహి.. దేహి అంటూ తిరుగుతున్నారని అన్నారు. తాను తెచ్చుకున్న పదవిని పీకేసి వల్లభనేని బాలశౌరి గారికి కట్టబెట్టారని, ఫైనాన్స్ కమిటీ మెంబర్ గా కూడా అవకాశాన్ని ఇచ్చారని దానికి కన్సిడరేషన్ ఏమిటో తెలియదని అన్నారు. బాలశౌరి గారు వైకాపాను తనకు తానే వీడారా లేక వైకాపా నాయకత్వమే ఆయన్ని పంపేసిందా? అన్న దానిపై సాక్షి దినపత్రిక స్పందిస్తే బాగుంటుందని అన్నారు.