ఐటీ కంపెనీలు ఏపీకి పంపిస్తామనడం కాదు.. ముందు నీటి సంగతి తేల్చండి : శైలజానాథ్

-

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ పరిశ్రమలు పెట్టాలని.. అవసరమైతే జగనన్నకు చెప్పి జాగా కూడా ఇప్పిస్తానని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీపీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ స్పందించారు. ఐటీ కంపెనీలు ఏపీకి పంపిస్తాం, స్థలాలు ఇప్పిస్తాం అని చెప్పడం కాదని..ముందు నీటి వాటాల సంగతేంటని ప్రశ్నించారు. ఐటీ కంపెనీలు ఏపీకి పంపిస్తామని కేటీఆర్ చులకన భావనతో మాట్లాడడం.. తమ మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు. కృష్ణా జలాల పంపిణీపై కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ రాయలసీమకు చావు దెబ్బలాంటిదని చెప్పారు. బీజేపీ అప్పర్ భద్ర ప్రాజెక్టును కర్ణాటక ఎన్నికల కోసం వాడుకుందని ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల కోసమే కృష్ణా జలాల పంపిణీపై కొత్త నోటిఫికేషన్ ఇచ్చిందని విమర్శించారు.

రాయలసీమకు శ్రీశైలం నీటిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులు మూతపడుతాయని శైలజానాథ్ అన్నారు. ఈ పరిణామాలపై సీఎం జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనం దృష్ట్యా అందరినీ కలుపుకుని పోయి నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఇక, మంత్రి కేటీఆర్ ఇటీవల వరంగల్‌‌ సమీపంలోని మడికొండ ఐటీ పార్క్‌లో రూ.40 కోట్లతో ఏర్పాటు చేసిన క్వాడ్రాంట్ సాఫ్ట్‌వేర్ కంపెనీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆంధ్రాలోని భీమవరం, నెల్లూరు ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు పెట్టాలని కోరారు. భీమవరం, నెల్లూరు ప్రాంతాల్లో భవిష్యత్‌లో ఉజ్వలమైన ఉపాధి అవకాశాలు వస్తాయని.. అక్కడ పిల్లలకు కూడా టాలెంట్ ఏం తక్కువ లేదన్నారు. బెంగళూరులో ఉన్న 40 శాతం మంది ఐటీ ఉద్యోగులు తెలుగువారేనని.. వారు సొంత ప్రాంతాలకు రావడానికి రెడీగా ఉన్నారని చెప్పారు. అక్కడ కూడా ఎన్నారైలు ఐటీ సంస్థలు పెట్టాలని.. కావాలంటే జగనన్నకు చెప్పి తాను జాగా ఇప్పిస్తానని కూడా చెప్పారు. అందరూ బాగుపడాలని.. అప్పుడే దేశం బాగుంటదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version