టీడీపీ జంపింగ్ ఎమ్మెల్యేల‌కు ప్ర‌శాంత‌త క‌రువైందే…!

-

పార్టీలు ఏవైనా.. ఎమ్మెల్యే గెలిచాడంటే.. దాని వెనుక ఎంతో క‌ష్టం.. కోట్ల ఖ‌ర్చు, ప్ర‌జాబ‌లం ఉండి తీరాల్సిందే. ఉత్తిపుణ్యాన ఎవ‌రూ అసెంబ్లీలో అడుగు పెట్టే రోజులు కావు. దీంతో ప్ర‌తి ఎమ్మెల్యే పైనా.. త‌న నియోజ‌క‌వ‌ర్గంపై బాధ్య‌త ఉంటుంది. త‌నను గెలిపించిన వారి బాగోగులు చూడాల్సిన అవ‌స‌రం కూడా ఉంటుంది. కాబ‌ట్టి ఎమ్మెల్యే ఎవ‌రైనా ఖ‌చ్చితంగా ఆయా విష‌యాలు మాత్రం కామ‌న్‌గా ఉంటాయి. ఇప్పుడు ఈ విష‌యం ఎందుకు చ‌ర్చ‌కు వ‌స్తోందంటే టీడీపీ త‌ర‌పున గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో గెలిచిన ఎమ్మెల్యేలు న‌లుగురు వైసీపీకి ప్ర‌త్య‌క్షంగా మ‌ద్ద‌తుదారులుగా మారిపోయారు.

విశాఖ ప‌ట్ట‌ణానికి చెందిన ద‌క్షిణ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ త‌న కుమారుడిని నేరుగా వైసీపీలోకి చేర్పించారు. ఇక తాను కూడా వైసీపీకి మ‌ద్ద‌తుగా ఉన్నారు. ఇక‌, గుంటూరు ప‌శ్చిమ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరిధ‌ర్ కూడా వైసీపీకి మ‌ద్ద‌తు దారుగా ఉన్నారు. చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం కూడా త‌న కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్ రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం వైసీపీకి మ‌ద్ద‌తు ప్ర‌కటించారు. ఇక‌, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే.. వంశీ.. టీడీపీతో క‌య్యం పెట్టుకుని.. వైసీపీకి మ‌ద్ద‌తుదారుగా మారారు. అయితే.. వీరికి ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన క‌ష్టం ఏమీ లేదు. కానీ, ఎప్పుడు అసెంబ్లీ జ‌రిగినా వీరికి టెన్ష‌న్ పెరిగిపోతోంది. అంతేకాదు క‌ర‌ణం, గిరిధ‌ర్ అయితే అసెంబ్లీ అంటే మ‌రింత టెన్ష‌న్‌కు గుర‌వుతున్నారు.

దీనికి కార‌ణమేంటి ? అని ఆరాతీస్తే.. తాము గెలిచి.. ఏడాదిన్న‌ర అయింది. ఇప్ప‌టి వ‌ర‌కు వారు వారి స‌మస్యల‌ను కానీ, నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధిపై కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు అసెంబ్లీలో చ‌ర్చించ‌లేదు. అంతేకాదు.. వారి పేర్లు కూడా క‌నీసం అసెంబ్లీ ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలోనూ వినిపించ‌డం లేదు. దీనికి కార‌ణం వారు టీడీపీ స‌భ్యులుగా కొన‌సాగుతుండ‌డం. ఆ పార్టీ త‌ర‌ఫునే ప్ర‌శ్నిస్తామంటూ.. స్పీక‌ర్‌కు నోటీసు ఇవ్వాలి. అలా ఇస్తే.. టీడీపీ ఒప్పుకోదు. అలాకాద‌ని.. వైసీపీ త‌ర‌ఫున ప్ర‌శ్నిస్తారా ? అంటే.. వేటు ప‌డుతుంది.అలాగ‌ని మౌనంగా ఉంటారా ? అంటే.. నియోజ‌క‌వ‌ర్గంలో త‌ల ఎత్తుకోలేక పోతున్నారు. దీంతో వీరు అటు ఇటు రెండు విధాలా న‌ర‌క యాత‌న త‌ప్ప‌డం లేదు.

ఈ న‌లుగురిలో గ‌ణేష్ ఇటీవ‌లే పార్టీ మారారు. ఆయ‌న్ను ప‌క్క‌న పెడితే వంశీకి గ‌న్న‌వ‌రం వైసీపీ శ్రేణుల నుంచి తీవ్ర నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆయన పార్టీ మారినా ఇప్ప‌టి వ‌ర‌కు ఒరిగింది లేదు. జిల్లాకే చెందిన మంత్రి కొడాలి నానిని ముందు పెట్టుకుని వెళుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు వంశీ ప్ర‌శాంత‌త లేదు. మ‌ద్దాలి గిరికి గుంటూరు ప‌శ్చిమ‌లో మిర్చి యార్డు చైర్మ‌న్ చంద్ర‌గిరి ఏసుర‌త్నం, లేళ్ల అప్పిరెడ్డి గ్రూపుల‌తో ఇబ్బంది త‌ప్ప‌డం లేదు. అప్పిరెడ్డి కంప్లీట్‌గా డామినేట్ చేయ‌డంతో గిరి మౌనంగానే ఉంటున్నారు.

పార్టీ మారిన న‌లుగురు ఎమ్మెల్యేల్లో కాస్తో కూస్తో ల‌బ్ధి పొందుతోంది మాత్రం చీరాల ఎమ్మెల్యే బ‌ల‌రాం ఒక్క‌రే. త‌న సీనియార్టీతో పాటు జిల్లాకే చెందిన మంత్రి బాలినేని అండ‌దండ‌లు ఉప‌యోగించుకుని నియోజ‌క‌వ‌ర్గానికి భారీగానే నిధులు రాబ‌ట్టుకోవ‌డంతో పాటు త‌న వ‌ర్గానికే ప‌ద‌వులు ఇప్పించుకుంటున్నారు. ఇంత చేస్తున్నా స్థానికంగా క‌ర‌ణంకు మాజీ ఎమ్మెల్యే ఆమంచితో నిత్యం ఘ‌ర్ష‌ణ‌లు త‌ప్ప‌డం లేదు. మ‌రి గిరి, వంశీ, గ‌ణేష్‌లు వైసీపీలో ప్ర‌శాంతంగా ఎప్ప‌ట‌కి కుదురుకుంటారో ?  చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news