అన్ని పార్టీలు ‘ఒక్కటైనా’… మళ్లీ అధికారం సీఎం జగన్‌ దే – విజయసాయిరెడ్డి

-

అన్ని పార్టీలు ‘ఒక్కటైనా’… మళ్లీ అధికారం సీఎం జగన్‌ దే అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో పది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ దృశ్యంలో ఎలాంటి గందరగోళం లేదు. ముఖ్యంగా పాలకపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కిందటి రెండు సాధారణ ఎన్నికల్లో మాదిరిగానే ఒంటరిగానే ముందుకెళుతోందని వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గుండె నిండా ఉన్న ఆత్మవిశ్వాసం పాలక పార్టీగా అవతరించాక వైఎస్సార్సీపీలో రెట్టింపయింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వంలోగాని, ఆయన పార్టీలోగాని వచ్చే ఎన్నికలపై ఎలాంటి అస్పష్టత లేదా గందరగోళం ఏమాత్రం కనిపించవని చెప్పారు.

అయోమయం, ఎటూ తేల్చుకోలేని పరిస్థితులు–ఇవన్నీ తెలుగుదేశం, ఇతర ప్రతిపక్షాల్లోనే దర్శనమిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు జరిగే 16వ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి, ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని మరో రెండు పార్టీలకు మధ్య ఎన్నికల పొత్తు గురించి దాదాపు ఏడాది నుంచి మీడియాలో ఊహాగానాలు, చర్చలు నడుస్తూనే ఉన్నాయన్నారు.

ఈ విషయంలో ఏదీ తేలకుండా సస్పెన్స్‌ కొనసాగుతోంది. అయితే, ప్రతిపక్షాల ఎత్తులు, జిత్తులు ఏమాత్రం పట్టించుకోకుండా పాలకపక్షమైన వైఎస్సార్సీపీ పూర్తిగా పాలనపైన, ప్రజా సంక్షేమంపైనే గత నాలుగేళ్లుగా దృష్టి కేంద్రీకరించింది. ఫలితంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దివంగత జననేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్‌ వరుసగా రెండు ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించనట్టుగానే నవ్యాంధ్ర ప్రదేశ్‌ లో కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ వరుస విజయాలతో అధికారం కైవసం చేసుకుంటుందనే మాట సర్వత్రా వినిపిస్తోంది. మీడియా, ఎన్నికల నిపుణులు, రాజకీయ పండితులు సైతం ఏపీ పాలకపక్షానికి దాని సంక్షేమ కార్యక్రమాల వల్ల తిరుగులేని ప్రజాదరణ ఉందని, జనం తీర్పు మరో రెండు దశాబ్దాల వరకూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పక్షానే ఉంటుందని అంచనా వేస్తున్నారని వెల్లడించారు సాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version