ఈ ఏడాది తక్కువ వర్షపాతమేనని విజయసాయిరెడ్డి ప్రకటన చేశారు. ఈ ఏడాది దేశంలో సగటు కన్నా తక్కువ వర్షపాతం పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సహా అనేక అంతర్జాతీయ సంస్థలు అంచనావేస్తున్నాయని…మానవ అంచనాలకు చాలాసార్లు అందని వర్షాలకు సంబంధించిన ఈ జోస్యాలు 5 శాతం అటూ ఇటూ కావచ్చని కూడా వాతావరణ నిపుణులు అంటున్నారని చెప్పారు సాయిరెడ్డి.
1996–2013 మధ్య కాలం సగటు వర్షపాతంతో పోల్చితే ఈ వానాకాలం దేశంలో వర్షాలు ఆశించినంత పడకపోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రతి కొన్ని సంవత్సరాలకు ప్రపంచంలో వర్షపాతం తగ్గడానికి దోహదం చేసే ఎల్ నినో ధోరణి ప్రభావం ఈ ఏడాది ఉండవచ్చని అంచనా. ఈ ముందస్తు లెక్కలను దృష్టిలో పెట్టుకుని వానలు తక్కువ కురిసే పక్షంలో ఏం చేయాలో ప్రభుత్వాలు ముందుగానే తగిన ఏర్పాట్లతో సిద్ధమౌతున్నాయని చెప్పారు.
మొత్తంమీద 2023లో దేశంలో 15 సంవత్సరాల (1996–2013) సగటు కన్నా 25 మిల్లీమీటర్ల మేర వర్షపాతం తగ్గవచ్చని మూడు వాతావరణ పరిశోధన సంస్థలు అంచనావేశాయి. అయితే, వర్షపాతంపై అంచనాలు వేయడానికి అనేక పద్ధతులు ఉన్నప్పటికీ ఏ ఒక్కటి లోపరహితం కాదని ఇంగ్లండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ లో వాతావరణ శాస్త్రవేత్త అక్షయ్ దేవరస్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ‘దేశంలో 70 శాతం జనాభా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రుతుపవనాలొచ్చే వర్షాకాలంపై ఆధారపడుతుంది. అంతేగాక, 26 కోట్లకు పైగా రైతులు వరి, గోధుమ, చెరకు వంటి పంటలు పండించడానికి రుతుపవనాలపైనే ఆశపెట్టుకుంటారు,’ అని ఇండియాలో నిరంతరం వాతావరణంపై సమాచారం అందించే సంస్థ స్కై మెట్ తెలిపిందన్నారు విజయసాయిరెడ్డి.