జగన్ మోహన్ రెడ్డి చేసిన నీటి యుద్ధాన్ని తెలంగాణ ప్రజలు పసిగడితే, ఆంధ్ర ప్రజలు అమ్మ దొంగ అంటున్నారని రఘురామకృష్ణ రాజు గారు ఎద్దేవా చేశారు. పరాయి రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలని పిచ్చివాళ్లుగా చూస్తున్న ఈ ప్రభుత్వ పెద్దలను పిచ్చివాళ్లను చేసి తరిమికొట్టే రోజులు ఎంతో దూరంలో లేవని తాను భావిస్తున్నానని, జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన చిలిపి నీటి యుద్ధం పై సోషల్ మీడియాలోను అలాగే ఎంతో మంది వ్యక్తిగతంగా తనతో మాట్లాడి తమ అసహనాన్ని వ్యక్తం చేశారని అన్నారు. తీవ్ర కరోనా సమయంలో అంబులెన్స్ వాహనాలను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులలోనే నిలిపివేస్తే, హైదరాబాదు నగరం ఉమ్మడి రాజధాని అని.. ఆపడానికి నువ్వెవరు అంటూ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రశ్నించ లేకపోయారని అన్నారు.
తెలంగాణలో ఉన్న ఒక రావు గారితో మాట్లాడుకుని నిబంధనలన్నీ తుంగలో తొక్కి తనను అరెస్టు చేశారని, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు జెంటిల్మెన్ అని, ఆయనతో కాకుండా వేరే రావు గారితో మాట్లాడారని తెలిపారు. ప్రజలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతుంటే, ఉమ్మడి రాజధానిలోకి వాహనాలను అనుమతించలేని పరిస్థితి నెలకొంటే అప్పుడు పోరాటం చేయడం మానేసి, ఇప్పుడు చిలిపి నీటి యుద్ధాలు చేయడం అవసరమా? అని ప్రశ్నించారు. వ్యక్తిగత కక్షల కోసం ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టారన్నారు. కేంద్రాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు తన పైనున్న కేసుల మాఫీ గురించి, నా అనర్హత గురించి మాత్రమే అడిగింది నిజం కాదా అంటూ నిలదీశారు. తన అనర్హత గురించి పార్టీ పార్లమెంట్ నాయకుడు అడిగితే కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఛీ… పొమ్మని అన్నది నిజం కాదా నిలదీశారు.