అన్నీ బాగానే ఉన్నా, జగన్ వ్యవహారం ఎక్కడో తేడా కొడుతోంది. ఇప్పటి వరకు పనిచేసిన ముఖ్య మంత్రుల పనితీరుతో పోల్చుకుంటే, జగన్ అందరి కంటే మెరుగైన పరిపాలనను అందిస్తూ, జనాల్లోనూ మంచి మార్కులే వేయించుకుంటున్నారు. ఇప్పటి వరకు కనీ, వినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి జన నాయకుడిగా తనను తాను నిరూపించుకున్నారు. ఎక్కడా ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా రాజకీయ వ్యవహారాలను నడుపుకుంటూ ముందుకు వస్తున్నారు. అయినా వైసీపీ ప్రభుత్వానికి ఆశించినంత స్థాయిలో క్రెడిట్ దక్కడం లేదు. దీనికితోడు అనవసర విమర్శలు మూటగట్టుకోవాల్సి వస్తుందనే అభిప్రాయం వైసిపి నాయకుల్లో ఉంది. జగన్ ను, వైసీపీ ప్రభుత్వాన్ని పదేపదే విమర్శిస్తూ, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నా, జగన్ మాత్రం వాటిని పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తున్నారు.
ప్రతిపక్షాల అన్నాక విమర్శలు చేయడం సర్వసాధారణ విషయమేననే అభిప్రాయంతో జగన్ తేలిగ్గా తీసుకుంటున్నారు. దీంతో అనవసర నిందలు మోయాల్సి వస్తోంది. ఎవరెన్ని విమర్శలు చేసినా, ప్రశంసలు ఇచ్చినా, జగన్ మాత్రం ఎక్క డా హడావుడి చేయడం లేదు. అసలు మీడియా ముందుకు వచ్చేందుకు సైతం ఆయన ఇష్టపడడం లేదు. ఏదైనా, అధికారుల ద్వారా చెప్పించడం, మినహా ఏ విషయంలోనూ జగన్ స్పందించడం లేదు. ఇదే అదునుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు మీడియా ముందు హడావుడి చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా, జగన్ మాత్రం మౌనంగానే ఉండిపోతున్నారు. తిరుమల డిక్లరేషన్, కోర్టు వ్యవహారాలు, ఇలా ఎన్నో ప్రకంపనాలు వచ్చినా, జగన్ మాత్రం సైలెంట్ గానే ఉంటున్నారు.
కొంతమంది పార్టీ కీలక నాయకులు మాత్రమే విమర్శలకు సమాధానం చెప్పడం, ప్రతి విమర్శలు చేయడం వంటివి చేస్తున్నారు.దీంతో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో నిజం ఉందా ? వాస్తవ పరిస్థితి ఏమిటి అనేది తెలియక ప్రజలు సైతం కన్ఫ్యూజ్ అవుతున్నారు. వైసీపీ ప్రభుత్వం పై అనవసర విమర్శలు రాకుండా, వాస్తవం ఏమిటో జగన్ ధైర్యంగా ప్రజలకు మీడియా ద్వారా చెప్పడంతో పాటు, అన్ని విషయాలపైన క్లారిటీగా మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం పై జనాలకు, ప్రతిపక్షాలకు అనుమానాలు అన్నీ తొలిగిపోతాయి. అలాకాకుండా జగన్ మౌనంగానే ఉంటూ, ఇదే వైకిరితో ముందుకు వెళితే, రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తప్పవు అనే సూచనలు ఇప్పుడు జగన్ కు అందుతున్నాయి.
-Surya