భారత త్రివిధ దళాల నూతన అధిపతి (సీడీఎస్)గా లెఫ్ట్‌నెంట్ జనరల్ అనిల్ చౌహాన్ నియమితులయ్యారు. ఇండియన్ ఆర్మీలో లెఫ్ట్‌నెంట్ జనరల్ హోదాలో పనిచేసిన అనిల్… ఇటీవలే పదవీ విరమణ పొందారు. తాజాగా ఆయనను కేంద్ర ప్రభుత్వం నూతన సీడీఎస్‌గా నియమించింది. ఈ మేరకు రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో నియమితులైన అనిల్ చౌహాన్.. కేంద్ర ప్రభుత్వానికి మిలిటరీ విభాగం సలహాదారుగా కూడా సేవలందిస్తారు. దాదాపు 40 ఏండ్ల పాటు వివిధ హోదాల్లో ఇండియన్ ఆర్మీలో పనిచేసిన అనిల్ చౌహాన్.. బిపిన్ రావత్ దుర్మరణంతో సీడీఎస్‌గా ప్రభుత్వం నియమించింది.
సైన్యంలో అతని విశిష్టమైన సేవలకు గుర్తింపుగా పరమ విశిష్ట సేవా పతకం, ఉత్తమ యుద్ధ సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, సేన పతకం, విశిష్ట సేవా పతకాలను అందుకున్నారు. జమ్ము కశ్మీర్‌తో పాటు ఆగ్నేయ భారతదేశంలో కౌంటర్ ఇన్‌సర్జెన్సీలో ఆపరేషన్స్ చేపట్టడంలో అనిల్ చౌహాన్ నేర్పరిగా పేరు గడించారు. op sunrise కార్యక్రమానికి రూపకల్పన చేసిన అనిల్ చౌహాన్.. భారత-మయన్మార్ సరిహద్దు సమీపంలో తిరుగుబాటు గ్రూపులకు వ్యతిరేకంగా ఇరుదేశాల సైన్యం సమన్వయ కార్యకలాపాలు కొనసాగించేలా చేయగలిగారు. బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ ప్రణాళికలో కూడా ఆయన పాల్గొన్నారు.