కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఏపీలో వివాదాలు రేగుతూనే ఉన్నాయి. ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సంకల్పం మేరకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన కార్యాచరణను కూడా సీఎం సిద్ధం చేశారు. ఇప్పటికిప్పుడు కొత్తగా ఏర్పాటయ్యే కలెక్టరేట్లకు ఇంకా ఇతర కార్యాలయాలకు ప్రభుత్వం తరఫున సొంత భవనాలు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు కనుక వీటిని అద్దె భవనాల్లో నడపనున్నారు.
ఇంకొన్నింటిని ప్రభుత్వ భవనాల్లోనే సర్దుబాటు చేయనున్నారు. చాలా చోట్ల పాఠశాలలు ఖాళీగా ఉన్నాయి కనుక వాటిని కూడా వీటికి కేటాయించనున్నారు. కొన్ని చోట్ల ఆర్డీఓ కార్యాలయాలతో సహా ఇంకొన్ని కార్యాలయాలు ఇప్పటికే ఏర్పాటు అయి ఉన్నాయి కనుక అవసరం అయిన మేరకు రెండు మూడు కార్యాలయాలను కలిపి ఒకే కార్యాలయంగా ప్రకటించే అవకాశాలున్నాయి. సమీకృత కలెక్టరేట్ ల ఏర్పాటుకు ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు సిద్ధం అయినా ఇంకా అవి అనుకున్నంత త్వరగా ఏర్పాటు కావు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాట్లు మరియు సన్నాహాలు ఓ విధంగా యుద్ధ మేఘాల మీద జరిగిపోతూ ఉంటే,మరోవైపు జిల్లాల ఏర్పాటుపై ఉన్న అభ్యంతరాలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా పాలకొండ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని తమను పార్వతీపురం కేంద్రంగా ఏర్పాటయ్యే మన్యం జిల్లాలో కలప వద్దని కోరుతూ శ్రీకాకుళం ఏజెన్సీ ఏరియాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. పాలకొండ జిల్లా సాధన సమితి పేరిట ఉద్యమాలు జరుగుతున్నాయి. పాలకొండను మన్యం జిల్లాలో కలపడం వల్ల తాము మరింత నష్టపోతామని నిరసనకారులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తరఫున పెద్దలు ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరుతున్నారు.